కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తన తదుపరి లక్ష్యాలను ప్రకటించారు. కొత్త ఏడాదిలో మరో మూడు అదనపు సైనిక నిఘా ఉపగ్రహాలను పరీక్షిస్తామని కిమ్ తెలిపారు.
Kim Jong Un: కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తన తదుపరి లక్ష్యాలను ప్రకటించారు. అమెరికా నేతృత్వంలోని ఘర్షణాత్మక ఎత్తుగడలను ఎదుర్కోవడానికి యుద్ధ సంసిద్ధత కోసం ఆయన పిలుపునిచ్చారు. కొత్త ఏడాదిలో మరో మూడు అదనపు సైనిక నిఘా ఉపగ్రహాలను పరీక్షిస్తామని కిమ్ తెలిపారు. అలాగే అణ్వస్త్రాలను సమకూర్చుకుంటామని తెలిపారు. ఈ ఏడాది అత్యాధునిక మానవ రహిత పరికరాలను ప్రవేశపెడతామని వెల్లడించారు.
అమెరికాతో దీర్ఘకాలంగా కొనసాగుతున్న సవాళ్ల నేపథ్యంలో తమ ఆయుధ సంపత్తిని మరింత బలోపేతం చేసుకుంటామని కిమ్ తెలిపారు. అలాగే కొత్త ఆయుధాల ప్రయోగ పరీక్షల పరంపర నూతన ఏడాదిలోనూ కొనసాగుతుందని తెలిపారు. ఉత్తర కొరియాకు వ్యతిరేకంగా అమెరికా, దాని మిత్రదేశాలు ఈ ఏడాది అనూహ్య చర్యలు తీసుకున్నాయని తెలిపారు. తద్వార కొరియా ద్వీపకల్పాన్ని అణుయుద్ధం అంచుకు నెట్టాయని తెలిపారు.
2019లో అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో చర్చలు విఫలమైన తర్వాత కిమ్ తమ ఆయుధ సంపత్తిని మరింత పెంపచుకునే పనిలో పడ్డారు. గతేడాది వ్యవధిలో ఉత్తర కొరియా 100కు పైగా బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. వాటిలో చాలా వరకు అణ్వస్త్ర సామర్థ్యం ఉన్నవే. వీటికి దీటుగా అమెరికా, దక్షిణ కొరియా కలిసి తమ సైనిక కార్యకలాపాలను విస్తరిస్తున్నాయి. అందులో భాగంగా బాంబర్లు, విమాన వాహన నౌకలు, అణ్వస్త్ర సామర్థ్యంతో కూడిన జలాంతర్గాములను రంగంలోకి దింపాయి. ఇరు దేశాలు చేస్తున్న చర్యలు.. తమని ఆక్రమించడానికి చేస్తున్న ప్రయోగాలని కిమ్ తెలిపారు.