అందాల నటి జమున తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. అందంతో కాక, అభినయంతో ఆకట్టుకున్నారు. మాతృ భాష తెలుగు కాకున్నా ఇక్కడి ప్రజలతో కలిసిపోయారు. కర్ణాటకలో గల హంపిలో 1936 ఆగస్ట్ 30వ తేదీన నిప్పని శ్రీనివాసరావు, కౌసల్యాదేవి దంపతులకు జమున జన్మించారు. గుంటూరు జిల్లా దుగ్గిరాలలో బాల్యం గడిచింది. జమునకు జనాభాయి అని పేరు పెట్టరాట.. జన్మ నక్షత్రం రీత్యా నది పేరు ఉండాలని జ్యోతిష్కులు చెప్పడంతో జమునగా మార్చారు. 1965లో జూలూరి రమణరావుతో జమునకు పెళ్లి అయ్యింది. శ్రీ వెంకటేశ్వర వర్సిటీలో ఆయన జువాలజీ ప్రొఫెసర్‌గా పనిచేశారు. 2014 నవంబరు 10వ తేదీన గుండెపోటు వచ్చి చనిపోయారు. జమున దంపతులకు కుమారుడు వంశీకృష్ణ, కూతురు స్రవంతి ఉన్నారు. జమున మృతిచెందారని తెలిసి టాలీవుడ్ షాక్‌నకు గురయ్యింది. ఉదయం 11 గంటలకు ఫిల్మ్ చాంబర్ వద్దకు జమున మృతదేహాన్ని తీసుకొస్తారు. అభిమానుల సందర్శనం కోసం అక్కడ ఉంచుతారు.
నాటకాలతో మంచి పేరు
సినీనటుడు జగ్గయ్యదీ జమున వాళ్ల గ్రామం కావడంతో నాటకాలకు తీసుకెళ్లాడు. నాటకాలు వేయడంపై జమున ఇంట్రెస్ట్ చూపించారు. తెనాలి సమీపంలో గల మండూరులో ‘ఖిల్జీ రాజ్య పతనం ‘ అనే నాటిక ప్రదర్శన కోసం జమున తీసుకువెళ్ళాడు. గుమ్మడి వెంకటేశ్వరరావు కూడా ఆ నాటికలో నటించాడు. నాటకాలతో ఫేమస్ కావడంతో సినిమా అవకాశాలు వరించాయి. బి.వి.రామానందం తీసిన పుట్టిల్లు జమున తొలిచిత్రం. ఆ సినిమాలో నటించే సమయంలో జమున వయస్సు 14 సంవత్సరాలు. ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, జగ్గయ్య సరసన హీరోయిన్గా నటించారు.
సత్యభామ పాత్రతో ఫేమ్
సత్యభామ పాత్ర బాగా పేరు తెచ్చింది. ఆ పాత్రలో జమునను తప్ప మరొకరిని ఊహించుకోలేం అనేలా నటించి మెప్పించింది. వినాయకచవితి సినిమాలో సత్యభామ పాత్రలో కనిపిస్తుంది. శ్రీకృష్ణ తులాభారం చిత్రంలో కూడా అదే పాత్ర వేశారు. సత్యభామ ఆహార్యం గురించి తగిన జాగ్రత్తలు తీసుకున్నారట. మిస్సమ్మ, ఇల్లరికం, ఇలవేల్పు, లేతమనసులు, గుండమ్మ కథ చిత్రాలు ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. కళాభినేత్రిగా జమున కీర్తి గడించారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో 198 సినిమాల్లో నటించారు.
అవార్డులు
ఫిలింఫేర్తోపాటు పలు అవార్డులు జమునను వరించాయి. 1967లో హిందీలో చేసిన మిలన్ సినిమా, 1964లో విడుదలైన మూగ మనసులు సినిమాలకు ఉత్తమ సహాయ నటిగా ఫిలింఫేర్ అవార్డు వచ్చాయి. పలు అవార్డులను గెలుచుకున్నారు.
ఇందిరాగాంధీ స్ఫూర్తితో రాజకీయాలు
మాజీ ప్రధాని ఇందిరా గాంధీ అంటే జమునకు అభిమానం, గౌరవం. దీంతో ఆమె రాజకీయ ప్రవేశం చేశారు. 1980లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాజమండ్రి నియోజకవర్గం నుంచి 1989లో లోక్ సభకు ఎన్నికయ్యారు. ఆ తరువాత రాజకీయల నుంచి తప్పుకున్నారు. అయినప్పటికీ 1990లో బీజేపీ తరఫున ప్రచారం చేశారు. తెలుగు ఆర్టిస్ట్ అసోసియేషన్ సంస్థ నెలకొల్పి గత 25 ఏళ్లుగా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.