బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇచ్చిన హామీలను గాలికొదిలేసి.. శ్వేతప్రతాలతో గారడీ చేస్తామంటే కుదరదని సోషల్ మీడియా ద్వారా ప్రశ్నించారు.
KTR: అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఇచ్చిన హామీలను గాలికొదిలేసి.. శ్వేతప్రతాలతో గారడీ చేస్తామంటే కుదరదని హెచ్చరించారు. ప్రచారంలో ఇచ్చిన ఊదరగొట్టి.. అధికారంలోకి రాగానే ప్రజలను మభ్యపెడతారా! అని కేటీఆర్ సోషల్ మీడియా ద్వారా ప్రశ్నించారు. ఏరు దాటిన తర్వాత తెప్ప తగలెయ్యడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ మండిపడ్డారు.
అరచేతిలో వైకుంఠం చూపించి అధికార పీఠం దక్కగానే మొండిచేయి చూపించడం తొండి వేషాలా! తొమ్మిదిన్నరేళ్ల మా ప్రగతి ప్రస్థానం.. తెలంగాణ ప్రజల ముందు తెరిచిన పుస్తకమని కేటీఆర్ పేర్కొన్నారు. శాసనసభకు సమర్పించిన బడ్జెట్ పత్రాలన్నీ ఆస్తులు, అప్పులు, ఆదాయ వ్యయాల శ్వేత పత్రాలే కదా అని అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో తాము విడుదల చేసిన ప్రతి ప్రగతి నివేదిక ఓ స్వచ్ఛమైన శ్వేతపత్రమని తెలిపారు. ఆడిట్ రిపోర్ట్లు, ఆర్బీఐ నివేదికలు ప్రతిపైసాకు లెక్క పత్రం చూపించి ఆర్థిక స్థితిని ఆవిష్కరించాయని గుర్తుచేశారు.
ప్రతిరంగంలో పదేండ్ల ప్రగతి నివేదికలు ప్రచురించి ప్రజల ముందు ఉంచాం. మేం దాచిందేమీ లేదన్నారు. కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేరని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు. వందరోజుల్లో నెరవేరుస్తామని చెప్పిన హామీలను మీరు నెరవేర్చేదాకా ప్రజల తరపున ప్రశ్నిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. ప్రజలు అడిగేది శ్వేతపత్రాలు కాదని.. గాలి మాటల గ్యారెంటీల సంగతని కేటీఆర్ నిలదీశారు. హామీలు అమలు చేయకపోతే.. అధికార పార్టీ కాంగ్రెస్కు కౌంట్ డౌన్ గ్యారెంటీ అని కేటీఆర్ హెచ్చరించారు.