»Huge Meeting In Hujurnagar Kcr Said That His Dream Was Fulfilled By Farmers
BRS: హుజుర్నగర్లో దద్దరిల్లిన సభ..మొగోళ్లు, మొనగాళ్లు నా తెలంగాణ రైతులేనన్న కేసీఆర్
తన కలను నెరవేర్చినవాళ్లు రైతులేనని సీఎం కేసీఆర్ అన్నారు. నేడు హుజుర్నగర్లో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ సీఎం కేసీఆర్ ప్రసంగంతో దద్దరిల్లింది. సభలో సైదిరెడ్డిని బంపర్ మెజార్టీతో గెలిపించి బీఆర్ఎస్ను అధికారంలోకి తీసుకురావాలని కేసీఆర్ ప్రజలను కోరారు.
తన కలను నిజం చేసిన మొగోళ్లు..మొనగాళ్లు తెలంగాణ రైతులేనని సీఎం కేసీఆర్ అన్నారు. రైతు బంధు పథకంతో పాటు ఇతర వ్యవసాయ పథకాలను అమలు చేయడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. హుజుర్నగర్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుబంధు పదాన్ని పుట్టించింది తానేనని అన్నారు. రైతు బంధు మంచిది కాదని ఉత్తమ్ కుమార్ రెడ్డి తిడుతున్నాడని, ఆ పథకం దుబారా అని అంటుండటం ఆశ్చర్యంగా ఉందన్నారు.
స్వామినాథనే హైదరాబాద్ వచ్చి రైతుబంధు పథకాన్ని ప్రశంసించినట్లు తెలిపారు. రైతుబంధు వద్దనే వారికి తగిన బుద్ధి చెప్పి తీరాలన్నారు. నవంబర్ 30న గుద్దుడు గుద్దితే పోలింగ్ బాక్సులే పగిలిపోవాలని, రైతు పథకాలను వ్యతిరేకించేవారికి గట్టి సమాధానం చెప్పి తీరాలని సీఎం కేసీఆర్ అన్నారు. రైతుకు స్వేచ్ఛ ఉండాలనే ఉద్దేశంతో రైతుబంధు నగదు ఇస్తున్నట్లు తెలిపారు. పంజాబ్ స్థానం తర్వాత మూడు కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం తెలంగాణ రైతులే పండిస్తున్నారన్నారు.
30 లక్షల ధాన్యం పండించే స్థాయి నుంచి నేడు 3 కోట్ల టన్నులు పండించే స్థాయికి ఎదిగినట్లు గుర్తు చేశారు. లిఫ్ట్‌లు పూర్తయితే 4 కోట్ల టన్నులను పండించి పంజాబ్‌ను దాటేస్తామన్నారు. మూడు గంటల కరెంట్ అనేటోడు పొలం దున్నడం ఎక్కడైనా చూశారా? అని కేసీఆర్ ప్రశ్నించారు. వ్యవసాయం లేదని, ఎద్దు లేదని, హైదరాబాద్‌లో ఏసీలో ఉండేవాడని, తాను అలా కాదని, తానొక రైతునని, వ్యవసాయం గురించి అన్ని విషయాలు తెలుసని, ఆ బాధలు తెలుసు కాబట్టే రైతు పథకాలను తీసుకొచ్చినట్లు కేసీఆర్ తెలిపారు.
ధరణిని భట్టి విక్రమార్క తీసివేస్తానని అంటున్నాడని కేసీఆర్ ధ్వజమెత్తారు. ధరణి పుణ్యమా అని రైతుబంధు నగదు రైతులకు అందుతోందన్నారు. రైతు బీమా కూడా నేరుగా రైతులకే అందుతున్నాయన్నారు. ధాన్యం డబ్బులు కూడా ఆ ఖాతాలోనే పడుతున్నాయన్నారు. ఆ ధరణిని తీసేస్తే పైరవీకారుల రాజ్యం వస్తాదని, రైతు భూమిని ముఖ్యమంత్రికి కూడా మార్చే దమ్ము లేదన్నారు. హుజుర్నగర్లో సైదిరెడ్డిని బంపర్ మెజార్టీతో గెలిపించాలని సీఎం కేసీఆర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.