»Nagam Janardhan Reddy Vishnuvardhan Reddy Joined Brs Ktr Fire On Revanth Reddy
CM KCR: బీఆర్ఎస్లో చేరిన నాగం జనార్ధన్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి.. రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్
సీఎం కేసీఆర్ సమక్షంలో మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి, జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డిలు భారత రాష్ట్ర సమితి పార్టీ (BRS)లో చేరారు. మరోవైపు కామారెడ్డి కార్యకర్తల సమావేశంలో మంత్రి కేటీఆర్.. తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు.
సీఎం కేసీఆర్ (CM KCR) సమక్షంలో మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి (Nagam Janardhanreddy), జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి (Vishnu Vardhan Reddy)లు బీఆర్ఎస్ (BRS) పార్టీలో చేరారు. బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు వారికి కండువా కప్పి వారిని బీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నాగం, విష్ణువర్ధన్ రెడ్డిలు తమ అనుచరులతో కలిసి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ..తన మిత్రుడు నాగం, యువనేత విష్ణువర్దన్ రెడ్డిలను పార్టీలోకి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.
నాగం జనార్ధన్ రెడ్డి (Nagam Janardhanreddy) 1969లో తెలంగాణ ఉద్యమంలో జైలుకు వెళ్లినట్లు గుర్తు చేశారు. పార్టీలోకి రావాలని ఆహ్వానించగా ఆయన అంగీకరించినందుకు సంతోషం వ్యక్తం చేశారు. సామాన్య ప్రజల కోసం నాగం పోరాడారని తెలిపారు. పీజేఆర్ తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి (Vishnu Vardhan Reddy) భవిష్యత్తు బాధ్యత తనదేనని కేసీఆర్ హామీ ఇచ్చారు.
రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్
కామారెడ్డి (Kamareddy) నియోజకవర్గంలో సీఎం కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి (Revanth Reddy) పోటీ చేస్తానని చెప్పటంపై మంత్రి కేటీఆర్ (KTR) వ్యంగ్యాస్త్రం సంధించారు. కొడంగల్‌లో చెల్లని వ్యక్తి కామారెడ్డిలో ఎలా చెల్లుతాడని కేటీఆర్ ప్రశ్నించారు. మాచారెడ్డి మండలం గజ్యా నాయక్ తండాలో కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంపై ఆయన తమ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..గిరిజన బిడ్డలకు పోడు భూముల పట్టాలు ఇచ్చిన ఘనత కేసీఆర్‌కే చెల్లుతుందన్నారు.
రాబోయే రోజుల్లో అర్హులందరికీ పోడు భూములు ఇవ్వనున్నట్లు కేటీఆర్ తెలిపారు. 3,146 తండాలను గ్రామ పంచాయతీలుగా కేసీఆర్ మార్చినట్లు గుర్తు చేశారు. కామారెడ్డి కోసం రాబోయే రోజుల్లో ఇక్కడే ఓ ప్రత్యేక భవణం ఏర్పాటు చేసి ప్రజా సమస్యలు వింటారని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీకి ఓటు వేస్తే తప్పు చేసినవాళ్లం అవుతామని, వారిని నమ్మొద్దని కేటీఆర్ ప్రజలకు సూచించారు. రేవంత్ రెడ్డికి దమ్ముంటే కామారెడ్డి నుంచి పోటీ చేయాలని, కొడంగల్‌లో చల్లని రేవంత్ రెడ్డి కామారెడ్డిలో ఎలా చెల్లుతాడని ప్రశ్నించారు.