»Another Shock For Chandrababu Kasani Gnaneshwar Resigned From Tdp
Kasani Gnaneshwar: చంద్రబాబుకు మరో షాక్..టీడీపీకి రాజీనామా చేసిన కాసాని జ్ఞానేశ్వర్
తెలంగాణ టీడీపీకి అధ్యక్షుడిగా ఉన్న కాసాని జ్ఞానేశ్వర్ రాజీనామా చేశారు. తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయడం లేదని తెలియడంతో పలువురు నాయకులు నిరాశలో ఉన్నారు. ఈ తరుణంలో కాసాని రాజీనామా చేసి ఒంటరిగానే ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. మరోవైపు కాసాని రాజీనామాతో టీడీపీకి షాక్ తగినట్లయ్యింది.
స్కిల్ స్కామ్ కేసులో అరెస్ట్ అయ్యి జైలులో ఉన్న చంద్రబాబుకు మరో షాక్ తగిలింది. తెలంగాణ తెలుగుదేశం పార్టీకి అధ్యక్షులుగా ఉన్న కాసాని జ్ఞానేశ్వర్ రాజీనామా చేసినట్లు ప్రకటించారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబుతో ఈ మధ్యనే కాసాని జ్ఞానేశ్వర్ ములాఖత్ అయ్యారు. ఆ సందర్భంగా తెలంగాణలో టీడీపీ ఎన్నికల బరిలోకి దిగడం లేదని చెప్పడంతో కాసాని కాస్త అసహనానికి గురయ్యారు. అంతేకాకుండా గత కొద్ది రోజుల నుంచి తెలంగాణ ఎన్నికలకు సంబంధించి అటు చంద్రబాబుగానీ, ఇటు నారా లోకేశ్ గానీ ఏ రకంగానూ స్పందించడం లేదన్నారు.
ఎన్నికల సమయం దగ్గరపడుతున్న తరుణంలో టీడీపీ తెలంగాణలో పోటీ చేయాలా? వద్దా? అనేది తేల్చుకోలేకపోవడంతో పార్టీ నేతలు నిరాశలో ఉన్నట్లు తెలిపారు. అందుకే తప్పని పరిస్థితిలో టీడీపీకి రాజీనామా చేసినట్లుగా కాసాని జ్ఞానేశ్వర్ తెలిపారు. టీడీపీ ఉనికి కోసం ఆ నాడు చంద్రబాబు తమని ఆహ్వానించారని, ఆ సందర్భంగా బీదబడుగు వర్గాలకు అవకాశం కల్పించి పార్టీని నిలబెట్టాలని కోరినట్లు తెలిపారు. కానీ ఇప్పుడు ఎన్నికల నుంచి తప్పుకోవడం బాధాకరంగా ఉందని కాసాని అన్నారు.
తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయడంపై నారా లోకేశ్ నుంచి తమకు ఎటువంటి సమాచారం అందలేదని కాసాని అన్నారు. తెలంగాణలో టీడీపీ ప్రజల్లోకి వెళ్లేందుకు పూర్తిగా నిమగ్నమై ఏర్పాట్లు చేశామన్నారు. ప్రజల్లోకి వెళ్లేందుకు ఓపెన్ టాప్ వాహనంలో బాబుతో ప్రచారం నిర్వహించాలని అనుకున్నామని, ముందుగా మహబూబ్ నగర్లో మీటింగ్ ఏర్పాటుకు ప్రణాళిక వేశామని, కానీ బాబు ఆదేశాల మేరకు ఖమ్మంలో మీటింగ్ పెట్టుకోవాల్సి వచ్చిందని తెలిపారు. 119 నియోజకవర్గాల్లో గ్రామాల్లోకి వెళ్లి టీడీపీ జెండా ఎగురవేశామన్నారు.
ఎన్నికల కోసం నేతలు ఐదేళ్లుగా ఎదురుచూస్తున్నారని, వారికి ఇప్పుడు అన్యాయం జరిగిందని కాసాని జ్ఞానేశ్వర్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో ఎన్నికల కోసం బాలకృష్ణ, నారా లోకేశ్‌ను సంప్రదించినా వారు స్పందించలేదన్నారు. ఇప్పటికే ఎన్నికల కోసం 30 మందిని ఫైనల్ చేశామని, వారికి ఇంకా బిఫారం కూడా ఇవ్వలేదన్నారు. అభ్యర్థులు వారి సొంత డబ్బులు పెట్టుకుని బరిలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నారని, వారిని ప్రోత్సహించకుండా కన్నీళ్లు కారేలా చేయడం బాధాకరమన్నారు.
ఎన్నికల్లో పోటీ చేయమని చెప్పడం రాజకీయ పార్టీకి అవమానకరమన్నారు. పోటీ చేయకపోవడానికి గల కారణాన్ని ఇంకా చెప్పలేదన్నారు. బీసీలకు 50 శాతం సీట్లు ఇస్తారని ఎదురుచూసిన వారంతో గగ్గోలు పెడుతున్నారన్నారు. పార్టీ కోసం డబ్బులు తీసుకున్నవారు కూడా కొంత అన్యాయం చేశారని ఆరోపించారు. అందుకే తప్పని పరిస్థితిలో పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం కాసాని జ్ఞానేశ్వర్ కుత్బుల్లాపూర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు.