»Jabardasth Rakesh I Mortgaged My House For The Movie Kcr Jabardasth Comedian
Jabardasth Rakesh: ‘కేసీఆర్’ సినిమా కోసం ఇల్లు తాకట్టు పెట్టాను.. జబర్దస్త్ కమెడియన్
జబర్ధస్త్ కమెడియన్ రాకేశ్ 'కేసీఆర్'కు వీరాభిమాని. ఆయన పేరుతో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. దీనికోసం తన సొంత ఇంటిని తాకట్టు పెట్టానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.
Jabardasth Rakesh: కామెడీ షో జబర్ధస్త్ చాలామంది జీవితాల్లో వెలుగులు నింపింది. ఈ షో ద్వారా ఎంతో మంది వాళ్ల టాలెంట్‌ను నిరూపించుకుని పాపులారిటీని సంపాదించుకున్నారు. ఇలాంటి వారిలో కమెడియన్ రాకేశ్ కూడా ఒకరు. కామెడీ షో ద్వారా పాపులారిటీ సంపాదించుకుని సినిమాల్లో చిన్న పాత్రల్లో నటించారు. బుల్లితెరపై తన టాలెంట్‌ను నిరూపించుకున్న రాకేశ్ వెండితెరపై కూడా తన టాలెంట్‌ను నిరూపించుకుంటున్నాడు. ఈక్రమంలో రాకేశ్ ఓ సినిమాను రూపొందిస్తున్నాడు. అందులో అతనే హీరోగా నటిస్తున్నాడు. తెలంగాణ ప్రాంతంలోని బంజారా నేపథ్యంలో తెరకెక్కుతున్న ‘కేసీఆర్’ సినిమాకు రాకేష్ హీరోగా నటిస్తున్నాడు. ఇటీవల ఆ సినిమా లాంచ్‌ను మంత్రి మల్లారెడ్డి చేతుల మీదుగా గ్రాండ్‌గా చేపట్టారు.
ఈ సందర్భంగా రాకేష్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ”హీరోలు, హీరోయిన్లకి ఫ్యాన్స్ ఉన్నప్పుడు కేసీఆర్‌కి ఎందుకు ఫ్యాన్స్ ఉండకూడదు. నేను కేసీఆర్‌కి వీరాభిమానిని. అందుకే ఆయన పేరుతో సినిమా తీస్తున్నాను. బినామీ డబ్బులతో నేను ఈ సినిమా నిర్మిస్తున్నానని చాలామంది అనుకుంటున్నారు. కానీ అది అబద్ధం. కేసీఆర్ సినిమా కోసం మా అమ్మకు ఇష్టమైన ఇంటిని కూడా తాకట్టు పెట్టానని” తెలిపారు. ఈ సినిమాకు తాను ఎందుకు నిర్మాతగా ఉండాల్సి వచ్చిందంటే.. సినిమా తీస్తానని కొందరు వ్యక్తులు మాటిచ్చారని, కానీ తర్వాత వారు మోసం చేశారన్నారు. ఆ కారణంగానే తాను నిర్మాతగా మారాల్సి వచ్చిందని రాకేశ్ తెలిపాడు.
ఒక రైటర్ మోసం చేయడం వల్లే సినిమా స్టార్ట్ కాకముందే తాను కారు కూడా అమ్మేశానని రాకేశ్ అన్నాడు. తన అమ్మ, భార్య సహకారం వల్లే కేరీర్ పరంగా సక్సెస్ సాధించానని తెలిపాడు. తన భార్య సుజాత బ్యాంకులో దాచుకున్న డబ్బులు ఇస్తానని చెప్పి తనని ప్రోత్సహించిందన్నారు. ఈ సినిమాకు రైటర్‌గా, అసిస్టెంట్ డైరక్టర్‌గా, కాస్ట్యూమ్ డిజైనర్‌గా సుజాత పనిచేస్తోందని తెలిపారు. టాలీవుడ్ నటి సత్యకృష్ణ కూతురు అనన్య మేనన్ ఈ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం కానుందని, గరుడవేగ అంజి డైరక్షన్లో ఈ సినిమా తెరకెక్కుతోందని తెలిపారు.