»Prabhakar Reddys Surgery Concluded Cm Kcr Visited
Kotha Prabhakar reddy: ముగిసిన ప్రభాకర్ రెడ్డి సర్జరీ..పరామర్శించిన సీఎం కేసీఆర్
కత్తి దాడికి గురైన మెదక్ ఎంపీ ప్రభాకర్ రెడ్డికి యశోద ఆస్పత్రి వైద్యులు సర్జరీ పూర్తి చేశారు. ఆస్పత్రిలో ఉన్న ఆయన్ని సీఎం కేసీఆర్ పరామర్శించారు. తమ పార్టీ నాయకులపై కాంగ్రెస్ పార్టీ భౌతిక దాడులకు పాల్పడుతోందని సీఎం కేసీఆర్ ఆరోపించారు. తాము చూస్తూ ఊరుకోమని, హింసా రాజకీయాలు ఆపాలని హెచ్చరించారు.
మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తి దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటన తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేకెత్తించింది. ఎన్నికల ప్రచారంలో ఆయనపై రాజు అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఈ తరుణంలో ప్రభాకర్ రెడ్డి కడుపులోకి కత్తి పోటు దిగటంతో గాయం అయ్యింది. దీంతో ఆయన్ని హైదరాబాద్ లోని యశోద ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రభాకర్ రెడ్డికి మెరుగైన చికిత్సను అందించారు.
సర్జరీ పూర్తి చేసిన వైద్యులు:
ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పొట్టలో తీవ్ర గాయం కావడంతో యశోద ఆస్పత్రి వైద్యులు సర్జరీ చేశారు. కత్తిపోటు వల్ల ప్రభాకర్ రెడ్డి పొట్టలోని చిన్న ప్రేగుకు నాలుగు చోట్ల గాయాలైనట్లు తెలిపారు. 15 సెంటీ మీటర్ల వరకూ పొట్ట భాగాన్ని కట్ చేసి కడుపులోని 10 సెంటీ మీటర్ల చిన్న ప్రేగును తొలగించినట్లుగా యశోద వైద్యులు వెల్లడించారు. ఆయన్ని వెంటనే హైదరాాబాద్కు తరలించపోయుంటే మరింత ప్రమాదం ఎదురయ్యేదని అన్నారు. రక్తం అంతా కడుపులోనే పేరుకుపోయిందని, అందుకే 15 సెంటీ మీటర్ల వరకూ కట్ చేయాల్సి వచ్చిందన్నారు. కడుపు భాగంలో పేరుకుపోయిన రక్తాన్ని అంతా క్లీన్ చేసినట్లు తెలిపారు. లోపల రక్తం పెరుకుపోవడం, ప్రేగుకు 4 చోట్ల గాయాలు కావడంతో సర్జరీ కొంత ఆలస్యం అయినట్లుగా యశోద ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు.
సీఎం కేసీఆర్ పరామర్శ:
హైదరాబాద్ లోని యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిని సీఎం కేసీఆర్ పరామర్శించారు. బాన్సువాడలో ఎన్నికల ప్రచారాన్ని ముగించుకుని హెలికాప్టర్ ద్వారా సీఎం కేసీఆర్ బేగంపేట ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. అనంతరం నేరుగా యశోదా ఆస్పత్రికి చేరుకుని ప్రభాకర్ రెడ్డిని పరామర్శించి వైద్యులతో మాట్లాడారు.
దాడిని తీవ్రంగా ఖండించిన కేసీఆర్:
ఎంపీ ప్రభాకర్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నంపై బాన్సువాడ సభలోనే సీఎం కేసీఆర్ స్పందించారు. దాడిని తీవ్రంగా ఖండించిన కేసీఆర్.. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని వ్యాఖ్యలు చేశారు. ప్రభాకర్ రెడ్డి కుటుంబీకులు, అభిమానులు ఎలాంటి ఆందోళనకు గురి కావొద్దని ధైర్యం చెప్పారు. తమ నేతలను భౌతికంగా అంతం చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, నిరాశలో ఉన్న కాంగ్రెస్ భౌతిక దాడులకు దిగుతోందని అన్నారు.
భౌతిక దాడులకు తెగబడుతోంది కాంగ్రెస్సే: కేసీఆర్
ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా ఓడిపోతామనే నిరాశలో ఉన్న కాంగ్రెస్ తమ పార్టీ నాయకులపై భౌతికదాడులకు దిగుతోందని సీఎం కేసీఆర్ ఆరోపించారు. ఈ ఘటనపై ఈసీ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభాకర్ రెడ్డిపై జరిగిన దాడి తన మీద జరిగినట్లుగానే భావిస్తున్నానన్నారు. హింసా రాజకీయాలను ప్రజలంతా ఖండించాలని పిలుపునిచ్చారు. దాడులకు పాల్పడిన వారికి బుద్ధి చెప్పాలని, తమకు తిక్కరేగితే రాష్ట్రంలో దుమ్ము రేగుతుందని హెచ్చరించారు. దాడులు ఆపకపోతే తాము కూడా కత్తి పట్టి అదే పని చేస్తామని, ఎన్నికల్లో ఎదుర్కొనే దమ్ము లేనివారే ఇలా కత్తులతో దాడికి దిగుతారని అన్నారు.