తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు గుర్తింపు కార్డులను జారీ చేశారు. ఈ సందర్భంగా టీటీడీ జేఈవో సదా భార్గవి మీడియాతో మాట్లాడారు. శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులతో ఆలయ సిబ్బంది, ఉద్యోగులు గౌరవ మర్యాదలతో వ్యవహరించాలని తెలిపారు. టీటీడీలో వివిధ సొసైటీల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు మెరుగైన వేతనం, ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు.
కార్పొరేషన్ ఉద్యోగుల మేలు కోసం మార్గదర్శకాలను రూపొందించినట్లు తెలిపారు. ఆర్జిత సెలవులు వర్తింపజేస్తామని, ప్రమాదవశాత్తూ ఉద్యోగి మరణిస్తే రూ.5 లక్షల ఇన్సూరెన్స్ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. గుర్తింపు కార్డుతో సుపథం మార్గం ద్వారా కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నామన్నారు. అదేవిధంగా రూ.20 చొప్పున నెలకు 10 లడ్డూల సబ్సిడీని ఇస్తున్నట్లు టీటీడీ జేఈవో సదా భార్గవి తెలిపారు.