Komatireddy Venkat Reddy Made Sensational Comments
KTR, Harish Rao: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం జోరందుకుంది. కాంగ్రెస్ రెండో విడత బస్సు యాత్రలో ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వంపై కస్సు బుస్సు మన్నారు. దానికి మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. 5 హామీలు అని అరచేతిలో వైకుంఠం చూపించి, గద్దె ఎక్కిన తర్వాత కొర్రీల మీద కొర్రీలు పెడుతూ ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు.
అన్న భాగ్య స్కీమ్ అటకెక్కిందని, గృహజ్యోతి పథకం ఆరిపోయిందని ఎద్దేవా చేశారు. ఇచ్చిన హామీలను విస్మరించిన కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు క్షమించరని అన్నారు. మంత్రి కేటీఆర్ (KTR) చేసిన కామెంట్లపై తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy) స్పందించారు. కర్ణాటకలో అమలవుతోన్న సంక్షేమ పథకాలను చూపించేందుకు హెలికాప్టర్ సిద్దం చేశాం.. ఎవరు వస్తారో బావ, బామ్మర్దులు (హరీశ్, కేటీఆర్) తేల్చుకోవాలని సూచించారు. అక్కడికి వెళ్లిన తర్వాత కన్నడ ప్రజలు తమకు పథకాలు అందడం లేదని చెబితే తన లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. మరి నిజమేనని చెబితే మీరు పదవులకు రాజీనామా చేస్తారా.? అని అడిగారు.
సిద్దిపేట నుంచి బరిలోకి దిగాలని పార్టీ కోరితే పోటీ చేస్తానని వెంకట్ రెడ్డి స్పష్టంచేశారు. కానీ పార్టీ అలాంటి ప్రయోగాలు చేస్తోందని తాను అనుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసేందు కోసం తాను ఎక్కడినుంచైనా సరే పోటీ చేయడానికి సిద్ధం అని తేల్చిచెప్పారు.