»Shock For The Police Who Have Passed 50 Years Key Decision On Retirement
Uttarpradesh: 50 ఏళ్లు దాటిన పోలీసులకు షాక్..రిటైర్మెంట్పై కీలక నిర్ణయం!
ఇక 50 ఏళ్లపైబడిన పోలీసులు రిటైర్మెంట్ తీసుకోనున్నారు. వారికి నిర్బంద పదవీ విరమణ ఇవ్వనున్నట్లుగా సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. సామర్థ్యం లేనివారిని తొలగించి వారి స్థానంలో సమర్థులైన వారిని నియమించే ప్రక్రియను యోగి ఆదిత్యనాథ్ సర్కార్ ప్రారంభించింది.
50 ఏళ్లు దాటిన పోలీసుల రిటైర్మెంట్పై ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. 50 ఏళ్లు దాటిన పోలీసుల సర్వీస్ హిస్టరీని (Police Service History) పరిశీలించి వారిని నిర్బంద పదవీ విరమణ చేయించనుంది. అందులో భాగంగా వారి ట్రాక్ రికార్డు (Track Record)ను ప్రభుత్వం పరిశీలించనుంది. ఆ తర్వాత స్క్రీనింగ్ చేసి వారిని నిర్భంద పదవీ విరమణ చేయించనుంది. యోగి ఆదిత్యనాథ్ (CM Yogi Adityanadh) ప్రభుత్వం ఈ సంచలన నిర్ణయం తీసుకోవడంతో పోలీసులు ఆందోళన చెందుతున్నారు.
యోగి సర్కార్ శుక్రవారం ఈ మేరకు నోటీసులను కూడా జారీ చేసింది. ఏడీజీ సంజయ్ సింఘాల్ తరపున ఐజీ రేంజ్ అధికారులు, ఏడీజీ జోన్లు, మొత్తంగా ఏడుగురు పోలీసు కమిషనర్లకు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. 50 ఏళ్లు దాటిన పోలీసు అధికారుల జాబితాను నవంబర్ 20వ తేది లోపు అందించాలని సర్కార్ ఆదేశాలిచ్చింది. 2023 మార్చి 31వ తేది నాటికి 50 ఏళ్లు నిండిన వారంతా ఈ జాబితాలో ఉండనున్నారు.
రిపోర్టులో ఆయా పోలీసుల పనితీరు, వారి సామర్థ్యం, ప్రవర్తన, సర్వీసులో అవినీతికి పాల్పడటం, చెడు ప్రవర్తన కలిగి ఉండటం వంటివన్నీ పరిగణలోకి తీసుకుని వారికి నిర్బంద పదవీ విరమణ ఇవ్వనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఉత్తరప్రదేశ్ (Uttarpradesh)లో శాంతిభద్రతలను మెరుగుపరిచే విషయంలో యోగి సర్కార్ ఈ పనిచేస్తున్నట్లుగా తెలిపింది.
పోలీసు శాఖలో కీలక సంస్కరణలను తీసుకొచ్చేందుకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో భాగంగానే పోలీసు శాఖలో సామర్థ్యం లేని అధికారులు, ఉద్యోగులను తొలగించాలని, వారి స్థానంలో సమర్థులైన వారికి బాధ్యతలు అప్పగించాలని ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాల మేరకు తాజాగా ఉత్తర్వులు వెలువడటంతో పలువురు పోలీసులు ఆందోళన చెందుతున్నారు. నవంబర్ 20వ తేదిలోపు ఈ ప్రక్రియ కొనసాగనుందని అధికారులు స్పష్టం చేశారు.