»Mukesh Ambani Reliance Approves Appointment Of Ambani Successors
Mukesh Ambani: అంబానీ వారసుల నియామకానికి రిలయన్స్ బోర్డు ఆమోదం
దేశంలో అతి పెద్ద కంపెనీ ముకేశ్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్. ఇందులో మూడు విభాగాల్లో వ్యాపార నిర్వహణ బాధ్యతలు స్వీకరించిన ముకేశ్ అంబానీ వారసులు.. ఇక నుంచి నాన్-ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ల హోదాలో వ్యవహరించడానికి రిలయన్స్ షేర్ హోల్డర్లు ఆమోదం తెలిపారు.
Mukesh Ambani: వ్యాపార దిగ్గజం, కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీకి ఊరట లభించింది. ముకేశ్ వారసులు ఈశా అంబానీ, ఆకాశ్ అంబానీ, అనంత్ అంబానీలను నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా నియామకానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ వాటాదారులు కూడా ఆమోదం తెలిపారు. రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో ముకేశ్ అంబానీ తనయులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఒక్కో విభాగంలో వీళ్లు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గతేడాది నుంచి రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ ఛైర్మన్ బాధ్యతల్ని ఆకాశ్ అంబానీ, రిలయన్స్ రిటైల్ బాధ్యతలని ఈశా అంబానీ, నూతన ఇంధన రంగ బిజినెస్ వ్యవహారాలను అనంత్ అంబానీ చూసుకుంటున్నారు.
ఆకాశ్, ఈశా, అనంత్ అంబానీలను రిలయన్స్ బోర్డులోకి తీసుకునేందుకు యాజమాన్యం ఆగస్టులోనే ఆమోదం తెలపగా.. తాజాగా రిలయన్స్ షేర్ హోల్డర్లు కూడా ఆమోదం తెలిపారు. ఈ విషయాన్ని రిలయన్స్ స్టాక్ ఎక్స్చేంజ్కు సమాచారం అందించింది. కవలలైన ఈశా, ఆకాశ్‌ల నియామకానికి 98 శాతం ఓట్లు లభించాయి. అనంత్ అంబానీకి 92.75 శాతం ఓట్లతో మద్ధతు లభించింది. ముకేశ్ భార్య నీతా అంబానీ బోర్డు డైరక్టర్‌గా ఇంతకు ముందే రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తమ పిల్లల కోసమే.. ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. బోర్డు నుంచి వైదొలగిన ఆమె పూర్తిగా రిలయన్స్ ఫౌండేషన్ కార్యకలాపాలను చూసుకోనున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ అండ్ ఎండీగా మరో ఐదేళ్లపాటు ముకేశ్ అంబానీనే కొనసాగుతారు.