ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబుకు పెను ప్రమాదం తప్పింది. ఆయన తన కాన్వాయ్‌తో అశ్వారావుపేట నుంచి ఖమ్మం వైపు వెళుతుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ఆయన కారుపై గోధుమ బస్తాలు పడటంతో కాన్వాయ్‌లో ఉన్నవారంతా ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. ఈ ప్రమాదం నుంచి మంత్రి అంబటి తృటిలో తప్పించుకున్నట్లు తెలుస్తోంది.
అంబటి రాంబాబు కాన్వాయ్ సత్తుపల్లి వద్దకు చేరుకున్నప్పుడు నాందేడ్ నుంచి వైజాగ్ కు ఓ లారీ గోధుమ బస్తాల లోడుతో ఆ దారిలోనే వెళ్తోంది. అయితే సత్తుపల్లి వద్ద హోండా షోరూమ్ సమీపంలో ఓ వాహనం నుంచి కర్రలు బయటికి వచ్చాయి. ఆ కర్రలు తగలడంతో గోధుమ లోడు తాళ్లు తెగిపోయి అదే సమయంలో అక్కడికి వచ్చిన మంత్రి అంబటి కారుపై రెండు గోధుమ బస్తాలు వెంట వెంటనే పడ్డాయి. ఈ ప్రమాదంలో కారు బాగా దెబ్బతిందని పోలీసులు తెలిపారు.
ఘటనపై అంబటి పీఏ పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పోలీసులు లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని కేసు ఫైల్ చేశారు. తన కారు దెబ్బతినడంతో మంత్రి అంబటి మరో కారులో ఖమ్మం వైపు వెళ్లారు. ఈ ఘటనపై వైసీపీ నేతలు, అంబటి అభిమానులు ఆందోళన చెందారు. అంబటికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.