అప్పన్న ఆలయంలోకి శునకం ప్రవేశించింది. దీంతో అర్చకులు అపచారంగా భావించి దర్శనాలను నిలిపివేశారు. రెండు గంటల తర్వాత ఆలయాన్ని శుద్ధి చేసి భక్తులను దర్శనానికి అనుమతించారు.
విశాఖపట్నంలోని సింహాచలం అప్పన్న ఆలయంలోకి (Simhachalam Appanna Temple) శునకం ప్రవేశించింది (Dog Entry). దీంతో అపచారం జరిగిందంటూ ఆలయ ప్రాంగణంలోకి ఎవ్వర్నీ రానివ్వకుండా అడ్డుకున్నారు. రెండు గంటల పాటు భక్తులకు దర్శనాలను నిలిపివేశారు. ఆలయంలో అర్చకులు సంప్రోక్షణ చేసిన తర్వాతనే దర్శనానికి అనుమతించారు. ఆలయంలోని నీలాద్రి గుమ్మం వరకూ శునకం (Dog) ప్రవేశించిందని భక్తులు తెలిపారు. సిబ్బంది నిర్లక్ష్యం వల్లే వీధి కుక్క ఆలయంలోకి వచ్చినట్లుగా పలువురు భక్తులు ఆరోపిస్తున్నారు.
ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. విజయదశమిని పురస్కరించుకుని మంగళవారం రాత్రి జమ్మివేట ఉత్సవాన్ని నిర్వహించారు. శ్రీరామ చంద్రుడి అవతారంలో అప్పన్న స్వామి భక్తులకు దర్శనమిచ్చారు. పండితులు వేద మంత్రాలు జపిస్తుండగా, నాదస్వర మంగళ వాయిద్యాల నడుమ సపరివార సమేతంగా సింహగిరిపై నుంచి మెట్ల మార్గంలోని కొండ దిగువ వరకూ స్వామివారు తరలివచ్చారు.
శమీపూజోత్సవం సందర్భంగా తోటలోని జమ్మిచెట్టుకు అర్చకులు పూజలు చేశారు. గోవింద నామాలతో సింహగిరి వైకుంఠాన్ని తలిపించగా భక్తులు తన్మయత్వంతో పులకించిపోయారు. అయితే బుధవారం వీధి కుక్క ఆలయంలోకి రావడాన్ని ఆలయ అధికారులెవ్వరూ గుర్తించలేదు. దీంతో ఆ శునకం అప్పన్న ఆలయంలోని నీలాద్రి గుమ్మం వరకూ వెళ్లింది. శునకాన్ని గమనించిన ఆలయ అర్చకులు అపవిత్రంగా భావించారు. దీంతో ఆలయాన్ని శుద్ధి చేసి రెండు గంటల తర్వాత భక్తులను దర్శనానికి అనుమతించారు.