అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా మరో కీలక నిర్ణయం తీసుకుంది. చంద్రునిపై ఇల్లు నిర్మించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తోంది. వ్యోమగాములు చంద్రునిపై ఉండి ప్రయోగాలు చేసేవిధంగా అక్కడే నివాసాలను ఏర్పాటు చేయనుంది.
చంద్రుడి (Moon)పైకి భారత్ తాజాగా చంద్రయాన్3 (Chandrayan-3) మిషన్‌ను ప్రయోగించిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ విజయవంతమైంది. చంద్రుడి దక్షిణ ధృవంపైకి వెళ్లిన మొదటి దేశంగా భారత్ (India) రికార్డు నెలకొల్పింది. భారత అంతరిక్ష సంస్థ అయిన ఇస్రో (ISRO) చంద్రయాన్3 ప్రయోగం విజయం తర్వాత అదే జోష్‌తో మరిన్ని మిషన్స్ ప్రయోగించిందేకు సిద్ధమైంది. అందులో భాగంగా సూర్యుడిపై రహస్యాలను ఛేదించేందుకు ఆదిత్య ఎల్1ను (Aditya L1) ప్రయోగించింది. గత కొన్ని ఏళ్ల నుంచి చంద్రునిపై ఇళ్లను నిర్మించి మానవ మనుగడను సాధ్యం చేయాలని శాస్త్రవేత్తలు (Scientists) అనేక ప్రయోగాలు చేస్తున్నారు.
తాజాగా ఈ విషయంలో అమెరికా (America) అంతరిక్ష పరిశోధనా సంస్థ అయిన నాసా (NASA) మరో కీలక అడుగు వేసింది. వ్యోమగాములు (Astronauts) చంద్రుడిపైకి వెళ్లి అక్కడే నివశించే విధంగా కృషి చేస్తోంది. అందుకోసం చంద్రుడిపై ఇళ్లను నిర్మించనుంది. ఈ ప్రయోగంలో భాగంగా ముందుగా త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీని వినియోగించుకోవాలని నాసా శాస్త్రవేత్తలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో అవసరమైతే త్రీడీ ప్రింటర్‌ను (3D Printing) చంద్రుడిపైకి పంపేందుకు నాసా సిద్ధమవుతోంది. 2040 నాటికి చంద్రునిపై ఇళ్లను నిర్మించే లక్ష్యంగా వచ్చే ఏడాది చంద్రుని (Moon)పైకి ఆ త్రీడీ ప్రింటర్‌ను నాసా పంపనుంది.
చంద్రునిపై మానవులు నివశించేందుకు అవసరమైన వాతావరణం (Temperature) అక్కడ ఉందా? అని శాస్త్రవేత్తలు ఇంకా పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకూ వ్యోమగాములు చంద్రుని (Moon)పైకి వెళ్లి రావడమే కానీ అక్కడే ఉండి పరిశోధనలు చేయలేదు. అందుకోసం చంద్రునిపై మానవ ఆవాసానికి అవసరమైన పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? అని తెలుసుకునేందుకు కొన్ని రోజులు అక్కడే వ్యోమగాములు (Astronauts) ఉండాలని నాసా (NASA) ఓ ఆలోచనకు వచ్చింది.
చంద్రునిపై వ్యోమగాముల కోసం ఇళ్లను నిర్మించే ప్రణాళికలను కూడా నాసా మొదలుపెట్టేసింది. ఈ విషయాన్ని న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో ప్రచురించడం విశేషం. చంద్రుడిపై ఇళ్లను నిర్మించే పనిని నాసా కొన్ని సంస్థలకు కేటాయించిందని, చంద్రునిపై ఆక్సిజన్, ఐరన్, సిలికాన్, అల్యూమినియాన్ని వెలికితీసి సోలార్ సెల్స్, వైర్లను ఉత్పత్తి చేసే పనులను బ్లూ ఆరిజన్ కంపెనీకి కేటాయించినట్లు సమాచారం.
వ్యోమగాములు (Astronauts) చంద్రుడిపైకి వెళ్లిన తర్వాత రాళ్లను తొలగించి, మట్టిని గట్టిగా చేయడానికి అవసరమైతే మిషన్స్ కూడా అక్కడ అభివృద్ధి చేసేందుకు రెడ్వైర్ అనే సంస్థకు నాసా అప్పగించనున్నట్లు తెలిపింది. ఇక అక్కడ టెంపరేచర్‌తో పని లేకుండా అక్కడ రేడియో ఐసోటోపిక్ విద్యుత్ వ్యవస్థను డెవలప్ చేయడానికి జెనోపవర్ సిస్టమ్ అనే సంస్థకు డీల్ అప్పగించినట్లు నాసా వెల్లడించింది. నాసా ప్లాన్ చూస్తుంటే ఈసారి అక్కడ ఇళ్లును నిర్మించడం ఖాయమనే అనిపిస్తోంది.