ఖమ్మంలో నిర్వహించిన తమ బీఆర్ఎస్ పార్టీ సభ విజయవంతమైందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సభకు పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు లక్షలాదిగా హాజరయ్యారని ఆయన చెప్పారు. ముగ్గురు ముఖ్యమంత్రులు, ఒక మాజీ ముఖ్యమంత్రితో నిర్వహించిన సభ చరిత్రలో నిలిచిపోనుందన్నారు. మైదానంలో చిన్నపాటి సముద్రం కనిపించిందన్నారు. మైదానం సరిపోక బయటే లక్షమంది దాక బీఆర్ఎస్ కార్యకర్తలు ఉండిపోయారని తెలిపారు మంత్రి పువ్వాడ.
ఈ నెల 15 నాడు సంక్రాంతి పండగ ఉన్నా తెలంగాణ ప్రజలు 18వ తేదీన సంక్రాంతి జరుపుకున్నారు అని అన్నారు. నిరంతరం ఇక్కడే ఉండి పనులను పర్యవేక్షించిన మంత్రి హరీష్ రావుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారాయన. ఖమ్మంలోని ప్రతి కార్యకర్తకు ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు భారీగా నిధులు ప్రకటించినందుకు సీఎం కేసిఆర్ కి ఆయన ధన్యవాదాలు తెలిపారు.