ఖమ్మంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభ సక్సెస్ అయింది. ఇక వివిధ రాష్ట్రాల్లో ఇలాంటి సభలు, పెద్ద ఎత్తున ర్యాలీలు చేపట్టాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఆయన మొదటి చూపు ఆంధ్రప్రదేశ్ వైపు ఉంది. విశాఖపట్నంలో భారీ బహిరంగ సభను ప్లాన్ చేస్తున్నారు. ప్రముఖ కాపు నేత తోట చంద్రశేఖరరావును ఏపీ బీఆర్ఎస్ చీఫ్గా నియమించారు. ఆయన ఆధ్వర్యంలో సభను ప్లాన్ చేస్తున్నట్లు బీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు. సభ ఎప్పుడు, ఎక్కడ అనేది త్వరలో వెల్లడించనున్నారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయాన్ని గుంటూరు లేదా విజయవాడలో ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. కానీ కేసీఆర్ మాత్రం విశాఖపట్నం వైపు చూస్తున్నట్లుగా తెలుస్తోంది.
విశాఖలో హెడ్ ఆఫీస్ ఏర్పాటు చేయాలనే కేసీఆర్ ఆలోచన వెనుక కారణాలు ఉన్నాయని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. ఒకటి విశాఖ కాస్మోపాలిటన్ సిటీ. ఇక్కడ పశ్చిమ బెంగాల్, ఒడిశా, బీహార్ తదితర రాష్ట్రాల నుండి వచ్చినవారు చాలామంది ఉంటారు. రెండోది… ఇక్కడ అన్ని సామాజిక వర్గాలు ఉంటాయి. వెలమ, కాపులు ప్రభావం చూపుతారు. మరో విషయం ఏమంటే, తన పూర్వీకులు విజయనగరం జిల్లాకు చెందినవారిగా చెప్పారు గతంలో. కాబట్టి ఇక్కడి నుండి సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందని ఆయన భావిస్తున్నట్లుగా చెబుతున్నారు.
హైదరాబాద్ వలె విశాఖను డెవలప్ చేస్తామని కేసీఆర్ చెప్పే అవకాశాలు ఉన్నాయి. హైదరాబాద్ లోని ఐటీ కార్యాలయాల శాఖలను విశాఖకు తీసుకు వస్తామని కూడా అక్కడ చెప్పుకునే సౌకర్యం ఉంటుంది. ఏపీలో విశాఖ ఐటీ నగరంగా పేరు పొందింది. ఇటీవలే ఖమ్మం బహిరంగ సభలో స్టీల్ ప్లాంటుపై మాట్లాడారు. స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టిన ఉద్యోగులకు కేటీఆర్ మద్దతు తెలిపారు.