»Imd Warning Heavy Rain Forecast For 19 States For Next 3 Days
Rain Alert: ఐఎండీ హెచ్చరిక..మరో 3 రోజులపాటు 19 రాష్ట్రాలకు భారీ వర్షసూచన
దేశవ్యాప్తంగా మరో మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. రుతుపవనాల కదలిక వల్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ఉంటాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.
దేశవ్యాప్తంగా రుతుపవనాలు (Monsoon) చురుగ్గా కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ (IMD) వివిధ రాష్ట్రాలకు అలెర్ట్ జారీ చేసింది. ఢిల్లీతో సహా 19 రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, మరో మూడు రోజుల పాటు ఈ వాతావరణ పరిస్థితులు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఢిల్లీలో జీ20 సదస్సు జరుగుతున్న సమయంలో కూడా భారీ వర్షసూచన (Heavy Rains) ఉందని తెలిపింది.
మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మూడు రాష్ట్రాలకూ ఎల్లో అలెర్ట్‌ను జారీ చేస్తూ ప్రకటన చేసింది. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, గాలులు వేగంగా వీచే అవకాశం ఉందని తెలిపింది. దేశంలోని తూర్పు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరించింది.
ఢిల్లీలో జీ20 సమావేశాలు నిర్వహిస్తున్న తరుణంలో భారత వాతావరణ శాఖ ప్రత్యేకంగా బులిటెన్‌ను విడుదల చేసింది. సెప్టెంబర్ 9, 10వ తేదీల్లో భారీ వర్షాలు కురుస్తాయని, వాతావరణం మేఘావృతమై ఉంటుందని, ముబ్బులు కమ్ముకుని ఉంటాయని తెలిపింది. సెప్టెంబర్ 8 నుంచి 10వ తేదిల మధ్య గరిష్ఠ ఉష్ణోగ్రతలు 35-39 డిగ్రీలు ఉంటాయని, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 26-28 డిగ్రీల మధ్య ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.