విపక్ష పార్టీలు ఏకమైతే బీజేపీ గెలుపు అసాధ్యమని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) స్పష్టం చేశారు. దేశ జనాభాలో 60 శాతం జనాభాకు విపక్ష కూటమి పార్టీలు ప్రాతినిధ్యం వహిస్తాయని పేర్కొన్నారు. ఈ దశలో ఇండియా కూటమి దేశ జనాభాలో 60 శాతం జనాభాకు ప్రాతినిధ్యవ వహిస్తోందని, రాష్ట్రాల్లో ఆయా పార్టీలు ఏకమైతే బీజేపీ (BJP)కి గెలుపు అసాధ్యమని, సమర్ధవంతంగా విపక్షాల కలయిక జరగాలని రాహుల్ పేర్కొన్నారు. ముంబైలో ముగిసిన విపక్ష ఇండియా కూటమి భేటీలో ఈరోజు రెండు కీలక నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. 12 మంది సభ్యులతో కూడిన సమన్వయ కమిటీ ఏర్పాటుతో పాటు సీట్ల సర్దుబాటు చర్చలను వేగవంతం చేయాలని నిర్ణయించామని అన్నారు.
ప్రతిపక్షాల విశాల ఐక్యతతో రాబోయే పార్లమెంటు(Parliament)ఎన్నికల్లో ‘ఇండియా’ ఘన విజయం సాధిస్తుందని ప్రతిపక్ష పార్టీల నాయకులు విశ్వాసం వ్యక్తం చేశారు. ముంబై(Mumbai)లో రెండు రోజుల సమావేశంలో మూడు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కూటమి కార్యకలాపాలను సమన్వయం చేసేందుకు 14 మంది సభ్యులతో సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు. లోక్‌సభ(Lok Sabha)ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేయాలని, సీట్ల సర్దుబాటుపై చర్చలను వెంటనే మొదలు పెట్టి సాధ్యమైనంత తర్వగా కొలిక్కి తేవాలని కూడా తీర్మానించారు.
సమన్వయ కమిటీలో కాంగ్రెస్ (Congress) ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ఎన్సీపీ చీఫ్ శరద్‌పవార్, డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్(MK Stalin), శివసేన (ఉద్ధవ్) నేత సంజయ్ రౌత్, ఆర్జేడీ నేత, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్, తృణమూల్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ, ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా, సమాజ్‌వాది పార్టీ నుంచి జావేద్ఖాన్, జేడీయూ జాతీయ అధ్యక్షుడు లలన్ సింగ్, జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్(Hemant Soren), సీపీఐ నేత డీ రాజా, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా, పీడీపీ అధినేత మెహబూబా ముఫ్తీ ఉన్నారు. సీపీఎం (CPM) నుంచి ఎవరు ఉంటారనేది ఇంకా ప్రకటించాల్సి ఉన్నది. కమిటీ సారథిని ఇంకా ప్రకటించలేదు.