అంతర్జాతీయ క్రికెట్లో 71వ సెంచరీ కోసం విరాట్ కోహ్లీకి దాదాపు మూడేళ్ల సమయం తీసుకున్నది. ఈ మాజీ భారత కెప్టెన్ కరోనా ముందు తన దూకుడైన ప్రదర్శనతో దాదాపు వరుస సెంచరీలు చేశాడు. 2019లో చివరిసారి సెంచరీ చేసిన కోహ్లీ మళ్లీ మూడేళ్ళ సమయం తీసుకున్నాడు. ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ తదుపరి రికార్డ్ కోసం వేచి చూస్తూ వచ్చారు. ఎట్టకేలకు గత ఏడాది సెప్టెంబర్లో ఆసియా కప్ ఆఫ్గనిస్తాన్తో జరిగిన మ్యాచ్లో కోహ్లీ అభిమానుల ఆశ నెరవేరుస్తూ ట్రిపుల్ డిజిట్ పరుగును అందుకున్నాడు. ఇక 2022 డిసెంబర్లో బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్ ద్వారా మూడేళ్ల తర్వాత వన్డే సెంచరీ నమోదు చేశాడు. ఆ తర్వాత మరో రెండు సెంచరీలు చేసి, అంతర్జాతీయ క్రికెట్లో 74 నమోదు చేశాడు.
2019 ఆసియా కప్ తర్వాత కోహ్లీ నుండి శతకం లేకపోవడంతో అభిమానులు నిరాశకు గురయ్యారు. ఈ క్రమంలో ఓ అభిమాని విరాట్ కోహ్లీ 71వ సెంచరీ పూర్తి చేసేవరకు తాను పెళ్లి చేసుకోను అంటూ ప్లకార్డు చేతపట్టుకున్నాడు. ఇది సోషల్ మీడియాలో అప్పుడు హల్చల్ అయింది. అయితే తాజాగా అదే అభిమాని ట్విట్టర్ వేదికగా, చేసిన పోస్ట్ మరోసారి వైరల్ అవుతోంది.
నేను కోహ్లీని 71వ సెంచరీ అడిగానని, కానీ తనకు ప్రత్యేకమైన పెళ్లి రోజున 74వ సెంచరీ చేశాడంటూ షేర్వానీతో ఉన్న ఫోటోను షేర్ చేశాడు. సదరు అభిమాని పేరు అమన్ అగర్వాల్. గతంలో తాను స్టేడియంలో కూర్చొని డెబ్బై ఒకటవ సెంచరీ చేసే వరకు పెళ్ళి చేసుకోనంటూ పట్టుకున్న ప్లకార్డు ఫోటోను ఓవైపు, రెండోవైపు టీవీలో కోహ్లీ సెంచరీ చేసినప్పుడు బ్యాట్ పైకి ఎత్తిన సమయంలో తాను షేర్వానీతో తీసుకున్న ఫోటోను షేర్ చేశాడు.