Tirumala: సెప్టెంబర్ 18 నుంచి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు
తిరుమలలో ఈ ఏడాది రెండు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. సెప్టెంబర్ 18 నుంచి 26వ తేది వరకూ బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నట్లు టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పోస్టర్లను విడుదల చేశారు.
తిరుమల (Tirumala) శ్రీవారి బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 18వ తేది నుంచి జరగనున్నాయి. టీటీడీ (TTD) ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి (Bhumana Karunakar Reddy) ఆధ్వర్యంలో అధికారులు బ్రహ్మోత్సవాల పోస్టర్లను విడుదల చేశారు. సెప్టెంబర్ 18వ తేది నుంచి 26వ తేది వరకూ ఈ బ్రహ్మోత్సవాలు కొనసాగుతాయని ప్రకటించారు. కార్యక్రమంలో టీటీడీ ఈవో ధర్మారెడ్డి పాల్గొన్నారు.
పోస్టర్ల విడుదల (Posters Release) సందర్భంగా టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ.. బ్రహ్మోత్సవాల తొలి రోజున రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం జగన్ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారన్నారు. సెప్టెంబర్ 22న గరుడ సేవ ఉంటుందని, 23న స్వర్ణరథం, 25న రథోత్సవం, 26న చక్రస్నానం, ధ్వజావరోహనం ఉంటాయని వెల్లడించారు. బ్రహ్మోత్సవాల రోజుల్లో ఎలాంటి సిఫారసు లేఖలను స్వీకరించమని తేల్చి చెప్పారు. ఈ ఏడాది అధిక మాసం కారణంగా రెండు బ్రహ్మోత్సవాలు ఉంటాయని, భక్తుల వసతులు, భద్రతపై అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.