»Even If One Child Goes Could Not Goes To School In Ap He Resigned From Ias Praveen Prakash
IAS: ఒక్క చిన్నారి స్కూల్‌కు పోకున్నా ఐఏఎస్‌కు రాజీనామా చేస్తా
నాలుగు సంవత్సరాల నుంచి 18 ఏళ్ల లోపు విద్యార్థులు కచ్చితంగా పాఠశాలలో లేదా కళాశాలలోనే ఉంటారని, అలా జరగని పక్షంలో తన ఐఏఎస్ పదవికి రాజీనామా చేస్తానని ఏపీ విద్యాశాఖ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ కీలక వ్యాఖ్యలు చేశారు.
AP, Education Principal Secretary Praveen Prakash says every child should go to school, or resign from IAS
IAS: దేశంలోని అన్ని రాష్ట్రాలు వంద శాతం అక్షరాస్యతను సాధించేందుకు కృషి చేస్తున్నాయి. ఆర్థిక పరమైన ఇబ్బందులతో చదువుకోలేని నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వాలు తగు సౌకర్యాలను కల్పిస్తూ వారి చదువును ప్రోత్సహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ఏపీ పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి (Education Principal Secretary), ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాష్ సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. ఐదేళ్ల వయసు నుంచి 18 ఏళ్ల మధ్యలో ఉన్న పిల్లలంతా పాఠశాలలో లేదా కాలేజీలో చదువుకుంటూ ఉండాలని పేర్కొన్నారు. దీనికి అనుగుణంగా వచ్చే నెల 4వ తేదీలోపు స్థూల ప్రవేశాల నిష్పత్తి (GER) వంద శాతం సాధించాలని అధికారులకు సూచించారు.
వాలంటీర్లు, టీచర్లు, లెక్చరర్లు, అధికారులు ఈ లక్ష్యాన్ని సాధించే దిశగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం సాయంతో ఇప్పటికే దీనిపై చర్యలు తీసుకున్నామని తెలిపారు. 2005 సెప్టెంబర్ నుంచి 2018 ఆగస్టు మధ్య జన్మించిన పిల్లల్లో ఏ ఒక్కరైనా సెప్టెంబర్ 4 తర్వాత బడి లేదా కాలేజీకి వెళ్లకుండా ఉన్నట్లు నిరూపిస్తే తాను ఐఏఎస్ పదవికి రాజీనామా చేస్తానని ప్రవీణ్ ప్రకాష్ స్పష్టం చేశారు. దీనిపై చాలా సీరియస్‌గా కింది స్థాయి నుంచి ఉన్నతాధికారుల వరకు అందరూ సమిష్టిగా కృషిచేస్తున్నారని, దాని ఫలితంగానే 464 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలోని పిల్లలు వంద శాతం చదువుకుంటున్నారని వివరించారు. అంతేకాదు ఏపీ వ్యాప్తంగా ఇదే స్ఫూర్తితో పనిచేయాలని అధికారులకు సూచించారు. వంద శాతం జీఈఆర్ సాధించిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ప్రపంచ రికార్డు సృష్టించాలని, దేశానికే ఏపీ ఆదర్శంగా నిలవాలని ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాష్ ధీమా వ్యక్తం చేశారు.