జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఏపీ మంత్రుల కౌంటర్ అటాక్ కొనసాగుతూనే ఉంది. రణస్థలం సభలో పవన్ కల్యాణ్.. సీఎం జగన్, మంత్రి రోజా లక్ష్యంగా విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. తర్వాత మంత్రులు ఒక్కొక్కరు పవన్‌పై ఫైర్ అవుతున్నారు. మంత్రి రోజా మరోసారి పవన్ కల్యాణ్ లక్ష్యంగా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సంక్రాంతి బరిలో నిలిచిన బాలకృష్ణ వీరసింహారెడ్డి, మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాలకు మంచి కలెక్షన్స్ వస్తున్నాయని పేర్కొన్నారు. పవన్ కల్యాణ్‌కు మాత్రం చంద్రబాబు నాయుడు నుంచి కలెక్షన్లు అందాయని తనదైన శైలిలో దెప్పి పొడిచారు. తాను ఎప్పుడూ చిరంజీవిని, ఆయన కుటుంబాన్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేయలేదని స్పష్టంచేశారు. చిరంజీవి రాజకీయాల్లో లేనందున విమర్శించలేదని, అతనిని ఎప్పటికీ అభిమానిస్తానని స్పష్టంచేశారు మంత్రి రోజా.
పవన్ కల్యాణ్, నాగబాబుపై మాత్రం విమర్శలు చేశారు మంత్రి రోజా. పవన్ కల్యాణ్ ఓ పొలిటికల్ జోకర్ అని రోజా హాట్ కామెంట్స్ చేశారు. చంద్రబాబు ఇచ్చే ప్యాకేజీకి అమ్ముడుపోయారని మండిపడ్డారు. అతను వీకెండ్ పొలిటిషీయన్ అని, మండే నుంచి ఫ్రై డే వరకు కనిపించడని ధ్వజమెత్తారు. రణస్థలంలో పిచ్చి వాగుడు వాగాడని ఫైరయ్యారు. ఇక నాగబాబు మనిషి పెరగాడే కానీ బుద్ది ఏ మాత్రం పెరగలేదన్నారు. జనసేన పార్టీ కార్యక్రమాల్లో నాగబాబు యాక్టివ్‌గా పాల్గొంటున్నారు. రణస్థలంలో జరిగిన యువశక్తి కార్యక్రమంలో కూడా పాల్గొని ప్రసంగించారు. దాంతో అతనిని కూడా వదలకుండా రోజా కామెంట్ చేశారు.
రణస్థలంలో సభలో పవన్ కల్యాణ్ రోజాను డైమండ్ రాణి అనడంతో వైసీపీ నేతలు ఎదురుదాడికి దిగారు. ‘మీ ఇళ్లలో మహిళలు లేరా, సినిమాల్లో నటించడం లేదా.. ఆడవాళ్లను అలా సంస్కారం లేకుండా మాట్లాడొచ్చా, ఇది మంచి పద్దతి కాదు’ అని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. మంత్రి రోజా కూడా అదే రేంజ్లో ఫైరయ్యారు. రెండు చోట్ల ఓడిపోయిన నీతో, రెండుసార్లు గెలిచిన నేను తిట్టించుకోవాలా అని అదేస్థాయిలో కౌంటర్ అటాక్ చేశారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికకు ఇంకా ఏడాదిన్నర వరకు సమయం ఉంది. అధికార, విపక్షాల మధ్య డైలాగ్ వార్ మాత్రం అప్పుడే తీవ్రస్థాయికి చేరుకుంది. రోజు ఏదో ఒక అంశంపై ఇరు పార్టీ నేతల మధ్య మాటల యుద్దం జరుగుతూనే ఉంది. ఇప్పుడు రణస్థలంలో పవన్ చేసిన కామెంట్లపై విమర్శలు కంటిన్యూ అవుతున్నాయి.