బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లాలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి స్పందించారు. బీఆర్ఎస్ జాతీయ పార్టీగా ప్రకటించాక 18వ తేదీన తొలిసారి ఈ సభను నిర్వహిస్తోంది. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మాజీ సీఎం, పలు పార్టీల అధ్యక్షులు హాజరవుతున్నారని తెలుస్తోంది. ఈ సభపై రేణుకా చౌదరి మాట్లాడుతూ… తెలంగాణలో ఈశాన్య దిక్కు స్థానికులకే కలిసి వస్తుందని, ఇక్కడ అందరికీ కలిసి రాదని వాస్తు శాస్త్రం చెప్పారు. రాష్ట్రంలో ఈశాన్య స్థానంలో ఉన్న తమ ఉమ్మడి జిల్లాలో బయటివాళ్లు వచ్చి సమావేశాలు పెడితే ఎలాంటి ప్రయోజనం ఉండదని, బీఆర్ఎస్ ఈ సభ ద్వారా వీఆర్ఎస్ తీసుకోవడం ఖాయమన్నారు.
తెలంగాణను సర్వనాశనం చేసిన కేసీఆర్, ఈ సంవత్సరంలో అయినా వాస్తవాలు మాట్లాడాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ హయాంలో గిరిజనులకు ఇచ్చిన భూమిని కేసీఆర్ బలవంతంగా లాక్కున్నారని ఆరోపించారు. తెలంగాణను సర్వనాశనం చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని ఎద్దేవా చేశారు. ప్రజలను కాపాడాల్సిన పోలీసులు వారి పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఖమ్మంలో అడుగు పెట్టడానికి ముందు కేసీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రానున్న ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ 10 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంటు స్థానాలు గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఖమ్మంలో ఏ పార్టీకి అవకాశం లేదని, ప్రజలు కాంగ్రెస్ కోసం రిజర్వ్ చేసి పెట్టారన్నారు.