»Amit Shah In Lok Sabha Bns If Get Cheating Married Will Be Imprisoned For Ten Years
Amit Shah: మోసం చేసి పెళ్లి చేసుకుంటే పదేళ్లు జైలు శిక్ష
లోక్ సభలో కేంద్రం ప్రవేశపెట్టిన భారతీయ న్యాయ సంహిత అనే కొత్త బిల్లు దేశంలో తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. ఐపీసీ సెక్షన్లో ఉన్న లోటుపాట్లను దీనిలో సవరించినట్లు పేర్కొన్నారు. అందులో భాగంగా మోసం చేసి పెళ్లి చేసుకోవడం సహా పలు శిక్షలలో పదేళ్ల జైలు శిక్షను ఖారారు చేసినట్లు ప్రకటించారు.
Amit Shah: ఇండియన్ పీనల్ కోడ్ (IPC) స్థానంలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదించిన భారతీయ న్యాయ సంహిత (BNS) బిల్లులో మహిళల రక్షణ కోసం మరింత పటిష్టమైన చట్టాలను రూపొందించినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. శుక్రవారం లోక్సభలో పత్రిపాదించిన ఈ బిల్లులో మహిళలకు అన్యాయం చేసే వారిని చట్టపరంగా కఠినంగా శిక్షించేలా మార్పులు చేసినట్లు తెలిపారు. మోసపూరిత పెళ్లిళ్లను నిరోధించేందుకు, లైంగిక దోపిడీకి అడ్డుకట్ట వేయడానికి చట్టాలు చేశామన్నారు.
పెళ్లి కోసం వ్యక్తిగతంగా కొంత మంది తమ మతాన్ని దాచిపెట్టడం నేరమని, దీనికి పాల్పడిన పురుషుడికి గరిష్ఠంగా పదేళ్ల జైలు శిక్ష విధించవచ్చని భారతీయ న్యాయ సంహిత బిల్లులో కేంద్రం ప్రతిపాదించింది. అదేవిధంగా పెళ్లి చేసుకుంటాననే హామీతో కానీ, ఉద్యోగం ఇస్తానని, ప్రమోషన్ ఇస్తామనే హామీలతో కానీ లైంగిక సంబంధం పెట్టుకోవడాన్ని కూడా శిక్షించదగిన నేరమేనని కేంద్రం స్పష్టం చేసింది. ఈ నేరానికి బీఎన్ఎస్ లో పదేళ్లు శిక్షతో పాటు జరిమానా కూడా విధించేలా మార్పులు చేసింది. నేర న్యాయ వ్యవస్థను సవరించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం ప్రవేశపెట్టిన మూడింటిలో ఈ బిల్లు ఒకటి. మూడు బిల్లులను పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి పంపాలని లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను షా కోరారు. తద్వారా ప్రతిపాదిత మార్పులను పరిశీలించవచ్చు.