»Tomato Thefts Are Increasing The Farmer Installed Cctv Cameras In The Farm
Tomatoes Farm : పెరుగుతోన్న టమాటా చోరీలు.. పొలంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన రైతు!
టమాటాల చోరీలు ఎక్కువవుతుండటంతో మహాారాష్ట్రకు చెందిన ఓ రైతు తన పొలంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాడు. తన పంటను దొంగల నుంచి కాపాడుకోవడానికి ఈ ప్రయోగం చేసినట్లు తెలిపాడు.
టమాటాల ధరలు (Tomatoes Rates) ఆకాశాన్నంటాయి. ఈ నేపథ్యంలో చాలా ప్రాంతాల్లో టమాటాల చోరీలు ఎక్కువవుతున్నాయి. ఏపీ(Andhrapradesh)లో అయితే ఇద్దరు రైతులను చంపిమరీ టమాటాలను ఎత్తుకెళ్లారు. ఈ వరుస ఘటనల నేపథ్యంలో మహారాష్ట్ర(Maharastra)కు చెందిన ఓ రైతు తన పొలంలో సీసీటీవీ (CCTV) కెమెరాలను ఏర్పాటు చేసుకున్నాడు. రైతు సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసుకున్న ఘటన సోషల్ మీడియాలో వైరల్(Viral) అవుతోంది. దేశవ్యాప్తంగా కిలో టమాటాల ధర రూ.100 నుంచి రూ.200ల వరకూ పలుకుతోంది.
మహారాష్ట్ర(Maharastra)లోని ఔరంగాబాద్‌కు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న షాపూర్ బంజర్‌లో దొంగలు టమాటాలను ఎత్తుకెళ్లారు. ఈ తరుణంలో తన పొలంలో రైతు శరద్ రావ్టే సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ రైతు 25 కిలోల టమాటాల(Tomatoes) బాక్సులను మూడు వేలకు అమ్ముతున్నాడు. దీంతో అత్యంత డిమాండ్ ఉండే టమాటాలు చోరీ కావడంతో తాను భరించలేకపోయినట్లు తెలిపాడు. తన పొలంలో చోరీలు జరగకుండా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు శరద్ రావ్టే తెలిపాడు.
తనకున్న 5 ఎకరాల పొలంలో ఎకరంన్నరలో టమాటా వేశానని, ఆ టమాటాలను అమ్మడంతో తనకు 6 నుంచి 7 లక్షల రూపాయల ఆదాయం వస్తుందని రైతు శరద్ రావ్టే (sharad Raavte) వెల్లడించారు. 10 రోజుల క్రితం గంగాపూర్ తాలూకాలో 25 కిలోల టమాటాలు చోరీ అయినట్లు తెలిపాడు. అందుకే తన పంట రక్షణ కోసం రూ.22,000 విలువైన సీసీటీవీ కెమెరాను ఏర్పాటు చేసినట్లు ఆ రైతు వివరించాడు. సౌరశక్తితో నడిచే సీసీ కెమెరాను ఏర్పాటు చేసుకుని తన స్మార్ట్ ఫోన్ ద్వారా ఎక్కడినుంచైనా విజువల్స్ చూసుకుంటున్నానని రైతు శరద్ రావ్టే వెల్లడించారు.