Love Marriage: ప్రేమించుకున్న వారిద్దరూ పెద్దలను ఒప్పించారు. ఆరు నెలల క్రితం పెళ్లి చేసుకున్నారు. ఇంతలో ఏమైందో ఏమో తెలియదు.. 12 గంటల వ్యవధిలో ఇద్దరూ మృతిచెందారు. వారిద్దరూ ఆత్మహత్య చేసుకున్నారని ప్రాథమికంగా తెలుస్తోంది. మృతికి గల కారణం ఇంకా తెలియలేదు. వరకట్నం కోసం మంజునాథ్ వేధించాడని… అందుకే తమ కూతురు రమాదేవి బలవన్మరణానికి పాల్పడిందని మృతురాలి పేరంట్స్ చెబుతున్నారు.
తాడిపత్రి పరిధిలో గల చిన్నపొలమడకు చెందిన మంజునాథ్, పొట్లూరి మండలం గరుగు చింతలపల్లి గ్రామానికి చెందిన రమాదేవి ప్రేమించి.. పెద్దలను ఒప్పించారు. ఆరు నెలల క్రితం పెళ్లి చేసుకున్నారు. దంపతుల మధ్య గొడవలు జరుగుతుండేవి కావచ్చు.. సోమవారం సాయంత్రం తాడిపత్రి సమీపంలో గల తెల్లవారిపల్లి వద్ద రమాదేవి సూసైడ్ చేసుకుంది. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది.
తమ కూతురి మరణానికి మంజునాథ్ కారణం అని రమాదేవి పేరంట్స్, బంధువులు ఆరోపించారు. ఈ మేరకు రైల్వే పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ఏమైందో ఏమో.. ఈ రోజు తెల్లవారు జామున మృతురాలి భర్త మంజునాథ్ కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. తాడిపత్రిలో రైలు కిందపడి సూసైడ్ చేసుకున్నాడు. గొడవలకు గల కారణం తెలియడం లేదు. ఇద్దరు తిరిగిరానీ లోకాలకు వెళ్లిపోయారు. ఆ కుటుంబాల్లో కడుపుకోతను మిగిల్చారు. ఇరువురి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.