తెలుగు రాష్ట్రల్లో సంచలన సృష్టించిన క్యాసినో కేసులో ప్రధాన నిందితుడు చికోటి ప్రవీణ్ (Chikoti Praveen) బీజేపీలో చేరడానికి రంగం సిద్దం చేసుకుంటోన్నారు.తాను రాజకీయాల్లో ప్రవేశిస్తానంటూ గతంలో స్వయంగా ప్రకటించిన చీకోటి.. ఈ దిశగా తన ప్రయత్నలు ముమ్మరం చేశారు. కరీంనగర్ ఎంపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్(Bandi Sanjay)ని ఢిల్లీలో చీకోటి ప్రవీణ్ కలిశారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణతోనూ ఆయన భేటీ అయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వివాదాస్పద తీరుతో, వివాదాస్పద వ్యవహారాలతో వార్తల్లో ఉండే చీకోటి ప్రవీణ్‌ను బీజేపీ (BJP) చేర్చుకుంటుందా? అనే చర్చ ప్రస్తుతం జోరుగా సాగుతోంది.
ఇటీవల బోనాల పండుగ (Bonala festival) సందర్భంగా ప్రైవేటు గన్మన్లను వెంటబెట్టుకుని లాల్ దర్వాజ అమ్మవారి దర్శనానికి వెళ్లి మరో వివాదంలో చిక్కుకున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణ బీజేపీ నేతలను వరుసగా కలుస్తున్నారు. అది కూడా ఢిల్లీలో భేటీ అవుతున్నారు. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకే వరుసగా కలుస్తున్నారని ప్రచారం జరుగుతోంది.కేసులను ఎదుర్కొంటోన్న ప్రస్తుత పరిస్థితుల్లో చీకోటిని పార్టీలోకి తీసుకుంటే.. బ్యాడ్ నేమ్ వస్తుందనే ఉద్దేశంతో బండి సంజయ్ ఉన్నట్లు తెలుస్తోంది.అదే సమయంలో చీకోటి ప్రవీణ్ చేరికకు బండి సంజయ్ పచ్చజెండా ఊపారనే వాదనలు కూడా లేకపోలేదు. త్వరలోనే పార్టీ పెద్దలతో సమావేశాన్ని ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారనీ చెబుతున్నారు. బీజేపీలో ప్రవీణ్ చేరిక లాంఛనమేనని, దీనికి అవసరమైన ముహూర్తాన్ని చూసుకుంటోన్నారని తెలుస్తోంది.