ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఓ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. తన దగ్గర పని చేసే డ్రైవర్ కి ఇన్సూరెన్స్ చేయించాడు. అనంతరం దారుణంగా హత్య చేశాడు. ఆ ద్వారా ఇన్సూరెన్స్ డబ్బు కొట్టేయాలని ప్లాన్ వేశాడు. ఆ ప్లాన్ బెడసికొట్టి.. దొరికిపోయాడు. ఈ సంఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకోగా…. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
పోలీసుల వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం జల్లి గ్రామం బోడతండాకు చెందిన ప్రధాన నిందితుడు శ్రీకాంత్ స్థిరాస్థి వ్యాపారం చేస్తూ కొంతకాలంగా నగరంలో మేడిపల్లిలో నివాసం ఉంటున్నాడు.
విలాసాలకు అలవాటు పడిన శ్రీకాంత్ ..బోగస్ కంపెనీల పేరుతో కొంత మంది ఉద్యోగుల పేర్లు చూపి బ్యాంకుల నుంచి క్రెడిట్ కార్డులు,లోన్లు తీసుకుని జల్సాలు చేసేవాడు. ఇదే క్రమంలో గతంలో రూ. 1.5 కోట్ల మోసం కేసులో నాచారం పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. తరువాత విడుదలైనా కూడా శ్రీకాంత్ తీరు మారలేదు.
వ్యాపారాలు కూడా చేసే శ్రీకాంత్ వద్ద రెండేళ్ళ క్రితం గుంటూరు జిల్లా నర్సంపేట మండలం గురజాలకు చెందిన భిక్షపతి అనే యువకుడు పనికి చేరాడు. అతనికి తల్లిదండ్రులెవరూ లేకపోవడంతో పనిలోకి చేరిన కొన్నిరోజులకే భిక్షపతి పేరుపై ఐసీఐసీఐ బ్యాంకులో రూ.50 లక్షల విలువ చేసే ఇన్సూరెన్స్ పాలసీ చేయించాడు.