»Mission Bhagiratha Employee Committed Suicide Due To Insufficient Salary
Mission Bhagiratha: జీతం సరిపోవడం లేదని ఉద్యోగిని ఆత్మహత్య
తక్కువ జీతంతో కుటుంబాన్ని పోషించుకోలేకపోతున్నాని లేఖ రాసి మిషన్ భగీరథ ఉద్యోగిని ఆత్యహత్య చేసుకుంది. మరోవైపు తెలంగాణలో అనేక మంది పంచాయితీ ఉద్యోగులు జీతాలు సరిగా ఇవ్వడం లేదని ఆందోళన చేస్తున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
Mission Bhagiratha employee committed suicide due to insufficient salary
ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు(salaries) తగినంతగా లేవని, అవి కూడా సమయానికి రావట్లేదని తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా(telangana state) జరుగుతున్న ధర్నాలు చూస్తునే ఉన్నాము. గ్రామ పంచాయితీ సిబ్బంది కూడా జీతాలు, రెగ్యూలరైజేషన్ విషయంలో రాష్ట్రమంతటా నిరసనలు చేస్తున్నారు. ఇక ప్రభుత్వం ఇంటింటికి నీళ్ల పేరుతో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ ఉద్యోగుల పరిస్థితి కూడా ఆద్వానంగా ఉంది. చాలీచాలని జీతంతో కుటుంబాలను పోషించలేక జీవితాన్ని చాలిస్తున్నారు. తక్కువ వేతనంతో పిల్లలను సాకలేకపోతున్నానని లేఖ రాసి మిషన్ భగీరథ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన నల్గొండ జిల్లా హాలియాలో చోటుచేసుకుంది.
స్థానిక ఎస్సై క్రాంతికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. తిరుమలగిరిసాగర్ మండలం అల్వాల గ్రామానికి చెందిన సింగం పుష్పలత (26) భర్త మహేష్ పానగల్ మిషన్ భగీరథ(mission bhagiratha) నీటి శుద్ధి కేంద్రంలో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేసేవాడు. వీరికి ఒక పాప సాన్విత, కుమారుడు సాయినందన్ ఉన్నారు. జీతం చాలక ఆర్థిక సమస్యలతో ఏడాది కిందట మహేష్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భర్త ఉద్యోగం పుష్పలతకు ఇచ్చారు. ఆమె హాలియాలోని సాయిప్రతాప్నగర్ కాలనీలో ఒక గది అద్దెకు తీసుకుని ఇద్దరు పిల్లలతో ఉంటుంది. గురువారం సాయంత్రం ఇంట్లో ఉరివేసుకుంది. కేసు దర్యాప్తులో భాగంగా ఆమె పుస్తకంలో రాసిన సూసైడ్ నోట్ బయటపడింది. దానిలో తన జీతం రూ.9500 చాలకపోవడం, అది కూడా సమయానికి అందకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నట్లు పేర్కొంది. అలాగే తాను ఆనారోగ్యంతో బాధపడుతున్నట్లు కూడా లేఖలో రాసుకొచ్చింది. కడుపులో గడ్డ ఉన్నట్లు దానికి తొలగించడానికి దాదాపు రూ.2 లక్షలు ఖర్చు అవుతుందని తన లేఖలో పేర్కొంది.