నాలుగేళ్ల బాలిక కిడ్నాప్ అయ్యింది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఘట్కేసర్లోని ఈడబ్ల్యూఎస్ కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది. నాలుగేళ్ల బాలిక కృష్ణవేణి ఆచూకీ కోసం అంతటా గాలిస్తున్నారు. బుధవారం రాత్రి 8 గంటల సమయంలో కిరాణాషాప్‌కి వెళ్లిన కృష్ణవేణి ఆ తర్వాత తిరిగి ఇంటికి చేరలేదు. దీంతో కుటుంబీకులు కంగారు పడ్డారు. పరిసర ప్రాంతాల్లో గాలించినా ఫలితం లేకుండా పోయింది. చివరికి కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బాలిక కిడ్నాప్ ఘటనతో పోలీసులు అలెర్ట్ అయ్యారు. స్థానికంగా ఉన్న సీసీ ఫుటేజ్ లను పరిశీలించారు. మతిస్థిమితం లేని ఓ వ్యక్తి బాలికను తీసుకెళ్తున్నట్లు గుర్తించారు. డాగ్ స్క్వాడ్‌తో పాటు వేర్వేరు బృందాలుగా విడిపోయి బాలిక ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గంటలు గడిచినా కూడా బిడ్డ జాడ తెలియకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
బాలిక కిరాణా దుకాణానికి వెళ్లిన సమయంలో స్థానికంగా ఉన్న సురేష్ అనే వ్యక్తి బాలికను తీసుకెళ్లినట్టుగా స్థానికులు చెబుతున్నారు. బాలిక కృష్ణవేణి ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. బాలిక కిడ్నాప్ అయిన ఘటన హైదరాబాద్‌లో కలకలం రేపింది. పోలీసులు బృందాలుగా విడిపోయి గాలిస్తున్నారు.