Byjus’s:ప్రజలకు ఆన్లైన్ విద్యను అందించే ఎడ్యూటెక్ స్టార్టప్ బైజూస్ కు రోజురోజుకు కష్టాలు పెరుగుతున్నాయి. రిట్రెంచ్‌మెంట్, కార్పొరేట్ గవర్నెన్స్ ప్రశ్నలతో చుట్టుముట్టబడింది. దీంతో BYJUకు చాలా మంది బోర్డు సభ్యులు రాజీనామా చేసినట్లు వార్తలు వచ్చాయి. ఒకప్పుడు దేశంలోనే అత్యంత విలువైన స్టార్టప్‌గా నిలిచింది బైజూస్. మీడియా నివేదికల ప్రకారం, సెక్వోయా క్యాపిటల్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ జి.వి. రవిశంకర్ కంపెనీ బోర్డుకు రాజీనామా చేశారు. రవిశంకర్‌తో పాటు ప్రోసస్‌కు చెందిన రస్సెల్ డ్రేసెన్స్టాక్ , చాన్ జుకర్‌బర్గ్ ఇనిషియేటివ్‌కు చెందిన వివియన్ వు కూడా తమ పదవులను విడిచిపెట్టినట్లు తెలుస్తోంది. వీటన్నింటి రాజీనామాలను కంపెనీ ఇంకా ఆమోదించలేదు. అయితే కంపెనీ అత్యంత కష్టతరమైన దశలో ఉన్న సమయంలో ఈ రాజీనామాలు జరిగాయి.
బైజూస్ ప్రస్తుతం అనేక కోర్టు కేసులను ఎదుర్కొంటోంది. దీంతో పాటు రుణ ఎగవేత కేసు కూడా సంస్థను ఇబ్బంది పెడుతోంది. ఇది మాత్రమే కాదు, గత ఆర్థిక సంవత్సరం 2021-22 ఆర్థిక ఫలితాలను కంపెనీ ఇంకా విడుదల చేయలేదు. కంపెనీకి చెందిన ముగ్గురు ఇన్వెస్టర్లు సంయుక్తంగా రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారని సమాచారం. కంపెనీ దాని వాటాదారుల మధ్య నిరంతర చర్చలు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే బైజూస్ అడిటర్ బాధ్యతల నుంచి డెల్లాయిట్ హాస్కిన్స్ అండ్ సెల్స్ పక్కకు తప్పుకుంది. కంపెనీతో మూడేండ్ల కాంట్రాక్టు ఒప్పందం ఉన్నా, ముందుగానే డెల్లాయిట్ హాస్కిన్స్ వైదొలగడం ఆసక్తి కరమైన పరిణామం. గత ఆర్థిక సంవత్సర ఆర్థిక ఫలితాలను వెల్లడించడంలో ఆలస్యమే కారణమని ఆ సంస్థ తన రెగ్యులేటరీ ఫైలింగ్ లో వివరించింది. 2016 నుంచి బైజూస్ కు డెలాయిట్ ఆడిటర్‌గా సేవలందిస్తున్నది. 2020 ఏప్రిల్ ఒకటిన మరో ఐదేళ్లకు డెల్లాయిట్ హస్కిన్స్ను ఆడిటర్ గా బైజూస్ నియమించుకుంది. తాజా డెల్లాయిట్ నిర్ణయంతో తమ ఆడిటర్‌గా బీడీఓను ఐదేండ్ల కాలానికి బైజూస్ నియమించుకున్నది.