Revanth Reddy: అమరవీరుల స్థూపం నిర్మాణంలో అవినీతి జరిగిందని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆరోపించారు. 2017లో నిర్మాణం చేపట్టిన సమయంలో రూ.66 కోట్ల అంచనా వేశారని.. అదీ ఇప్పుడు రూ.155 కోట్లకు చేరిందని చెప్పారు. కాంట్రాక్టర్‌తో మంత్రి కేటీఆర్ కుమ్మక్కయ్యారని ఆరోపించారు. ఉత్సవాల పేరుతో ప్రజల సొమ్మును ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు.
త్యాగాలు అవమానించేలా..
తెలంగాణ అమరవీరుల పోరాటాల చరిత్రతో అమరవీరుల స్థూపం ఉండాలి. అమరవీరుల త్యాగాలతో సీఎం కేసీఆర్ అధికారం అనుభవిస్తున్నారని రేవంత్ రెడ్డి (Revanth Reddy) పేర్కొన్నారు. ఉద్యమకారుల త్యాగాలను అవమానించేలా అమరవీరుల స్థూపం ఆవిష్కరణ జరుగుతోందని రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. అమరవీరుల సంఖ్య 1200 అని తొలి అసెంబ్లీ సమావేశంలో సీఎం కేసీఆర్ చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. సభలో అమరవీరులపై ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఉద్యమ చరిత్ర, అమరవీరుల త్యాగాలను అవమానించేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని చెప్పారు. అమరవీరుల స్థూపం నిర్మాణం కోసం 2017 జూన 17వ తేదీన కమిటీ రూపొందించారు. స్థూప నిర్మాణం కోసం 63 కోట్ల 75 లక్షల 35 వేల 381 రూపాయలతో టెండర్లు పిలిచారు. కేసీసీ ప్రాజెక్ట్స్ పేరుతో కేసీ పుల్లయ్య కంపెనీకి టెండర్లు దక్కించుకున్నారు. కేటీఆర్ ఫ్రెండ్ తేలుకుంట్ల శ్రీధర్‌కు దగ్గరి వ్యక్తి కామిశెట్టి అనిల్ కుమార్‌కు దక్కిందన్నారు.
పేర్లు రాయరా..?
అమరవీరుల స్థూపంలో అమరవీరుల పేర్లను రాయలేదు. మరీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పేరు ఎందుకు పెట్టాలని అడిగారు. అమరవీరుల స్థూపం అంటే తెలంగాణ ఉద్యమం ప్రతిధ్వని. శ్రీకాంతాచారి, యాదయ్య లాంటి అమరవీరుల త్యాగం వల్లే తెలంగాణ ఏర్పడిందన్నారు. నిజామాబాద్ బై పోల్‌లో డీ శ్రీనివాస్ ఓడిపోతే ఇషాన్ రెడ్డి ప్రాణం త్యాగం చేశారు. కానిస్టేబుల్ క్రిష్ణయ్య తుపాకీతో కాల్చుకుని చనిపోయాడు. స్థూపం కట్టేందుకు 9 ఏళ్లు పడితే.. ప్రగతి భవన్ కట్టేందుకు కేవలం 9 నెలలు పట్టిందని చెప్పారు. 520 మంది ఉద్యమకారులకు మాత్రమే ఆర్థిక సాయం చేసింది. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరవీరుల కుటుంబాలను గుర్తించి, నెలకు రూ.25 వేల పెన్షన్ ఇప్పిస్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని తెలిపారు.