దర్శక ధీరుడు రాజమౌళి చరిత్ర సృష్టించేందుకు ఇంకో అడుగు దూరంలో మాత్రమే ఉన్నారు. రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీ.. ఇప్పటికే పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో అవార్డులు సొంతం చేసుకుంది. న్యూయార్క్ ఫిలిం క్రిటిక్స్, హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ ఫిలిం అవార్డ్స్ గెలుచుకున్నఈ సినిమా.. ఇప్పుడు ఆస్కార్ దిశగా అడుగులేస్తోంది. ఊహించినట్టే ఈ మూవీలోని మాస్ బీట్ ‘నాటు నాటు’ బెస్ట్ సాంగ్ నామినేషన్స్ బరిలో నిలిచింది. 95వ ఆస్కార్ అవార్డు కోసం డాక్యుమెంటరీ ఫీచర్, ఇంటర్నేషనల్ ఫిల్మ్, మేకప్ అండ్ హెయిర్‌స్టైలింగ్, స్కోర్, ఒరిజినల్ సాంగ్, సౌండ్, విజువల్ ఎఫెక్ట్స్, షార్ట్స్ సహా మొత్తం 10 విభాగాల్లో షార్ట్‌లిస్ట్‌లను ప్రకటించారు. ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ విభాగంలో పదిహేను పాటలను షార్ట్ లిస్ట్ చేసినట్లుగా ఆస్కార్ పేర్కొంది. మొత్తం 81 పాటలు ఈ విభాగంలో పోటీ పడగా.. అందులో 15 పాటలను సెలెక్ట్ చేశారు. వాటిలో ‘ఆర్ఆర్ఆర్’ నాటు నాటు సాంగ్ కూడా ఒకటి. దాంతో14 ఎంట్రీలతో నాటు నాటు పోటీ పడుతోంది. అయితే వీటిలో మళ్ళీ ఐదు పాటలు నామినేషన్స్‌కు వెళతాయి. ఆ తర్వాత ఐదింటిలో ఒకటి విన్నర్‌గా నిలుస్తుంది. ఇక షార్ట్‌లిస్ట్‌లో ఎంపికైన చిత్రాలకు జనవరి 12 నుంచి 17 వరకూ ఓటింగ్ నిర్వహించనున్నారు. ఆ ఓటింగ్ ఆధారంగా చేసుకుని జనవరి 24న ఆస్కార్ నామినేషన్లో నిలిచిన చిత్రాలను ప్రకటిస్తారు. మార్చి 12న విజేతలకు ఆస్కార్ అవార్డులు అందించనున్నారు. ఈ సందర్భంగా.. ఈ జర్నీలో తమకు సపోర్ట్ చేసిన వారికి థాంక్స్ తెలిపింది ఆర్ఆర్ఆర్ చిత్రయూనిట్.. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించగా.. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా నటించారు.