మొన్న సీనియర్ నటులు కైకాల సత్యనారాయణ.. నిన్న శరత్ బాబుపై అసత్య వార్తలు (Fake News) ప్రసారం చేసిన కొన్ని సోషల్ మీడియా చానల్స్ (Social Media Channels) తాజాగా సీనియర్ హాస్య నటుడు సుధాకర్ బేతాపై (Sudhakar Betha) అబద్ధపు వార్తలు ప్రసారం చేస్తున్నాయి. అతడి ఆరోగ్యం విషమంగా ఉందని.. చనిపోయారంటూ కూడా ఇష్టమొచ్చినట్టు వార్తలు రాసేస్తున్నాయి. తమ వ్యూస్, తమ చానల్ పాపులారిటీ కోసం బతికి ఉన్న వ్యక్తులనే చనిపోయినట్లు (Death) ప్రసారం చేస్తున్నాయి. వీటి తీరుతో వారు ఎంత ఇబ్బందులు పడుతున్నారో పట్టించుకోవడం లేదు. తనపై ఆరోగ్యంపై వస్తున్న వార్తలు, వదంతులపై సుధాకర్ స్పష్టత ఇచ్చారు. ఈ సందర్భంగా ఓ వీడియో విడుదల చేశారు.
తప్పుడు వార్తలను ఖండించారు. తాను ఆరోగ్యంగా (Healthy) ఉన్నానని ప్రకటించారు. ‘అందరికీ నమస్కారం. నా మీద వచ్చినవి.. వస్తున్న వార్తలు అసత్యం (Wrong). తప్పుడు సమాచారాన్ని నమ్మకండి. అలాంటివి వ్యాప్తి చేయకండి. నేను చాలా సంతోషంగా ఉన్నా’ అని విజ్ణప్తి చేశారు. కాగా, సుధాకర్ పై ఇలాంటి తప్పుడు వార్తలు, అసత్యాలు ప్రచారం కావడం తొలిసారి కాదు. 2010లో సుధాకర్ తీవ్ర అస్వస్థతకు గురై కోమాలోకి (Coma) వెళ్లగా మరణించారని అప్పుడే ప్రచారం చేశారు. మెరుగైన వైద్యం అందడంతో ఆయన తిరిగి కోలుకుని సాధారణ జీవితం పొందారు. అయితే జన బాహుళ్యం, సినీ కార్యక్రమాల్లో పాల్గొనకపోవడంతో మళ్లీ అలాంటి ప్రచారాలు మొదలయ్యాయి.
తెలుగు సినీ పరిశ్రమలో (Tollywood) సుధాకర్ మొదట హీరోగా పరిచయమయ్యారు. అనంతరం హాస్య నటుడిగా రాణించారు. సహాయ నటుడు (Character Artist), విలన్ (Villan)గా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సిసింద్రీ (Sisindri) సినిమా ఆయన కెరీర్ లో మరుపురాని సినిమాగా నిలిచిన విషయం తెలిసిందే. సూర్యవంశం (Suryavamsam) సినిమాలో వెంకటేశ్ కు సమానంగా సుధాకర్ పాత్ర పోషించి ప్రేక్షకులను మెప్పించారు.
కాగా ఇలాంటి వార్తలు (False News) తరచూ రావడంపై సినీ వర్గాలు (Movie Industry) అసహనం వ్యక్తం చేస్తున్నాయి. ప్రముఖులు బతికి ఉన్నా కూడా మరణించారని తప్పుడు వార్తలు రాయడం సరికాదని సినీ రంగానికి చెందిన వారు చెబుతున్నారు. గతంలో కైకాల, కె.విశ్వనాథ్, తారకరత్న, శరత్ బాబు.. ఇప్పుడు సుధాకర్ పై ఇలా తప్పుడు వార్తలు రాయడం సరికాదని హితవు పలుకుతున్నారు. ఎందుకు ఇలాంటి తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్నారో అర్థం కావడం లేదని అసహనం వ్యక్తం చేశారు.