టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ ఆదివారం కన్నుమూశారు. కూకట్ పల్లిలోని తన నివాసంలో రాజ్ గుండెపోటుకు గురయ్యారు.
టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ ఆదివారం మృతి చెందారు. ‘రాజ్ – కోటి’లో ఒకరిగా పేరు గాంచిన రాజ్ మరణ వార్త తెలియడంతో సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. 90వ దశకంలో సంగీత దర్శకత్వంలో రాజ్ కోటిది తిరుగులేని ప్రయాణం. వీరిద్దిరి కాంబోలో అనేక సూపర్ డూపర్ హిట్లు వచ్చాయి. అప్పట్లో వీరిద్దరికీ మంచి డిమాండ్ ఉండేది. వీరిద్దరి కాంబోలో ఏ సినిమా వచ్చినా మ్యూజికల్ హిట్ గా నిలిచేది.
రాజ్-కోటి ద్వయంలో వచ్చిన సినిమాలు అద్భుతమైన మ్యూజిక్ టాక్ ను తెచ్చుకున్నాయి. దాదాపు 150కు పైగా చిత్రాలకు వీరిద్దరూ కలిసి పనిచేశారు. ముఠామేస్త్రి, బావా బావమరిది, గోవిందా గోవిందా, హలోబ్రదర్ వంటి సినిమాలు మ్యూజికల్ హిట్స్ గా నిలిచాయి. అయితే కొన్ని అనుకోని కారణాల వల్ల కోటి నుంచి విడిపోయిన రాజ్ సొంతంగా కొన్ని మూవీస్ కు సంగీతం అందించారు. సిసింద్రీ, రాముడొచ్చాడు, ప్రేమంటే ఇదేరా వంటి సినిమాలకు రాజ్ సంగీత దర్శకుడిగా పనిచేశారు.
కొన్ని సినిమాల్లో రాజ్ అతిథి పాత్రల్లోనూ కూడా నటించారు. కూకట్ పల్లిలోని తన నివాసంలో రాజ్ గుండెపోటుకు గురయ్యారు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. రాజ్ కు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఆయన అంత్యక్రియలు రేపు హైదరాబాద్ మహాప్రస్థానం శ్మశానవాటికలో నిర్వహించనున్నారు.