»Tamil Nadu Factory Owner Arrested Over Methanol Tragedy That Killed 21
Methanol Tragedy 21కి చేరిన కల్తీ మద్యం మృతుల సంఖ్య.. 16 మంది అరెస్ట్
మృతి చెందిన బాధితులకు సీఎం స్టాలిన్ రూ.10 లక్షలు ఆర్థిక సహాయం ప్రకటించారు. అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులకు ప్రభుత్వం అండగా నిలిచింది. ప్రత్యేకంగా వైద్య సహాయం అందిస్తున్నారు.
తమిళనాడులో (Tamil Nadu) కల్తీ మద్యం మృతుల సంఖ్య పెరుగుతోంది. మృతుల సంఖ్య 21కి చేరింది. అయితే ఈ మరణాలకు ఓ మిథనాల్ (Methanol) కంపెనీ కారణంగా నిలిచింది. 21 మంది మృతులకు కారణమైన ఈ కంపెనీ యజమానిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా ఈ సంఘటనపై తమిళనాడు ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఆ కంపెనీపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin) ఆదేశించారు. ఈ ఘటనలో మొత్తం 16 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. కల్తీ మద్యం బాధితులను సీఎం ఆస్పత్రిలో పరామర్శించారు.
విల్లుపురం (Villupuram District), చెంగల్ పట్టు జిల్లాలో (Chengalpattu District) కల్తీ మద్యం వెలుగులోకి వచ్చింది. మద్యం తయారీ చేసేంందుకు ఉపయోగించే మిథనాల్ ను చెన్నైకి చెందిన జయశక్తి ప్రైవేట్ లిమిటెడ్ (Jaya Sakthi Private Ltd) సరఫరా చేసింది. ఈ కంపెనీ కరోనా సమయంలో మూసివేశారు. అప్పుడు మిథనాల్ అలాగే నిల్వ ఉంది. ఇటీవల ఆ మిథనాల్ ను సుమారు 8 లీటర్లు ఇద్దరు వ్యక్తులకు సరఫరా చేశారు. ఈ మిథనాల్ తో కల్తీ మద్యం విల్లుపురం, చెంగల్ పట్టు జిల్లాల్లో సరఫరా అయ్యింది. ఇది సేవించిన ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఏకంగా 21 మంది మృతి చెందగా.. మరో 30 మంది గాయపడ్డారు.
ఈ సంఘటనను తీవ్రంగా పరిగణించిన తమిళనాడు ప్రభుత్వం (Govt of Tamil Nadu) విచారణకు ఆదేశించింది. కంపెనీలో మిగిలిన 1,192 లీటర్ల మిథనాల్ ను స్వాధీనం చేసుకున్నారు. కల్తీ మద్యంపై ఉక్కుపాదం మోపడంతోనే ప్రజలు మిథనాల్ ను సేవిస్తున్నారని పోలీస్ చీఫ్ డాక్టర్ శైలేంద్ర బాబు (Dr Sylendra Babu) తెలిపారు. ఈ సంఘటనలో కంపెనీ యజమాని ఇళయనంబితోపాటు (Ilayanambi) మొత్తం 16 మందిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. కాగా మృతి చెందిన బాధితులకు సీఎం స్టాలిన్ రూ.10 లక్షలు ఆర్థిక సహాయం ప్రకటించారు. అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులకు ప్రభుత్వం అండగా నిలిచింది. ప్రత్యేకంగా వైద్య సహాయం అందిస్తున్నారు.