ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళీ తెరకెక్కించిన బాహుబలి సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. తాజాగా ఓ మీడియాతో మాట్లాడిన రాజమౌళి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. బాహుబలి మొదటి భాగం విడుదలైనప్పుడు ప్రపంచ వ్యాప్తంగా పాజిటీవ్ టాక్ వచ్చి, తెలుగు రాష్ట్రాల్లో నెగిటివ్ టాక్ వచ్చిందని అన్నారు. టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా బాహుబలి మిగిలిపోతుందని తనతో అన్నారని చెప్పారు. ఆ మాటలు విన్న తనకు చాలా బాధేసిందని చెప్పారు. నిర్మాతలు నష్టపోతారని తాను భయపడ్డట్టు తెలిపారు. అందుకు విరుద్దంగా విడులైన మొదటి వారంలోనే పాజిటీవ్ టాక్ రావడంతో తాను ఊపిరి పీల్చుకో గలిగానన్నారు జక్కన్న.
బాహుబలి మొదటిబాగం 2015లో విడుదలై సంచలన విజయం సాధించింది. అందుకు సీక్వెల్ గా వచ్చిన బాహుబలి 2 నిర్మాతలకు అధిక లాభాలు తీసుకొచ్చాయి. మామూలుగా రాజమౌళి తాను తెరకెక్కించే సినిమాలను చాలాకాలం పాటు షూటింగ్ జరుపుతారు. ప్రతీ సీన్ ను తాను అనుకున్నట్లు వచ్చేవరకు ఊరుకోరు. రాజమౌళి కెరీర్ లో బాహుబలికి పడిన శ్రమ మరే సినిమాకు పడలేదంటే అతిశయోక్తికాదేమో.
బాహుబలి సినిమాకు హీరో ప్రభాస్, రాణాలు కత్తి సాము, గుర్రపు స్వారీ లాంటి వాటిపై శిక్షణ తీసుకున్నారు. ప్రతీరోజు జిమ్ లో విపరీతమైన కసరత్తులతో తమ బాడీని ఆ కాలం నాటి యుద్దవీరులుగా తీర్చిదిద్దుకునేందుకు 24గంటలు కష్టపడ్డారనడంలో అతిశయోక్తి లేదనే చెప్పాలి. ఈ సినిమాకు రాజమౌళి దర్శకత్వం, కీరవాణి సంగీతం, సెంథిల్ కెమెరా , విజయేంద్రప్రసాద్ కథ ముఖ్య భూమిక పోషించగా… కాస్ట్యూమ్స్, భారీతనంతో కూడిన సెట్స్ బాహుబలికి నిండుతనాన్ని తీసుకువచ్చాయి.
బాహుబలి విదలై సంచలన విజయాన్ని నమోదు చేయడంతో.. భారత దేశంలోనే ట్రెండ్ సెట్టర్ గా ఈ సినిమా నిలిచింది. బాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా యావత్ భారత సినీ ప్రపంచం బాహుబలికి నీరాజనాలు పలికింది. ‘వై కట్టప్ప కిల్డ్ బాహుబలి’ అనే హ్యాష్ ట్యాగ్ తో చర్చకు దారితీసిన బాహుబలి 2.. విడుదలై ప్రేక్షకులను ఉర్రూతలూగించిన సంగతి తెలిసిందే. సెకండ్ పార్ట్ తో బాహుబలి నిర్మాతలకు అధికలాభాలు వచ్చాయని ఇండస్ట్రీవర్గాలు పేర్కొన్నాయి.