వచ్చే ఎన్నికల్లో మళ్లీ విజయం సాధించాలని చంద్రబాబు చాలా పట్టుదలతో ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన తన బాధను ప్రజలతో పంచుకున్నారు. ఈ వచ్చే ఎన్నికల్లో తనను గెలిపించాలని.. లేదంటే ఇవే తనకు చివరి ఎన్నికలు అంటూ ఎమోషనల్ అయ్యారు. అయితే… ఆయన కామెంట్స్ ని అధికార పార్టీ తమకు అనువుగా చేసుకుంది. చంద్రబాబు మాట్లాడిన మాటలను టార్గెట్ చేసుకొని విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికే బొత్స విమర్శలు చేయగా.. తాజాగా… ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి కూడా విమర్శలు చేయడం గమనార్హం.
ఇవే చివరి ఎన్నికలు అని చంద్రబాబే కాదు జనాలు కూడా అనుకుంటున్నారని సజ్జల అన్నారు. అందుకే 2019 లోనే చంద్రబాబు, టీడీపీను సాగనంపారని గుర్తుచేశారు. చంద్రబాబు దింపుడు కళ్ళెం ఆశలా ప్రజలను అడుగుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యంలో బెదిరింపులు, ఏడుపులు, పెడబొబ్బలకు విలువ ఉండదని సజ్జల అన్నారు. తన కోసమే ప్రజలు ఉన్నారని చంద్రబాబు అనుకుంటాడని సజ్జల విమర్శించారు.
తన భార్య పేరును పది సార్లు ప్రజల్లో చెప్పటం ద్వారా చంద్రబాబే ఆమెను అవమానిస్తున్నారని సజ్జల అభిప్రాయపడ్డారు. బహుశా చంద్రబాబు ప్రవర్తనకు ఆమె కూడా కుమిలి పోతూ ఉంటారేమో అని సందేహం వ్యక్తం చేశారు. మరిచిపోయినవన్నీ అతనే ప్రజలకు గుర్తు చేస్తున్నాడని అన్నారు.
నేను ముఖ్యమంత్రిగానే వస్తానని అనటం ఏంటని ప్రశ్నించారు. రాష్ట్రం, ప్రజలు తనకు బాకీ ఉన్నారని అనుకుంటున్నారా? అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు మాటల్లో అధికారం నాకు హక్కు అన్న ధోరణి, పొగరు కనిపిస్తోందని సజ్జల అన్నారు. ఎవరైనా చంద్రబాబు భార్యను అవమానిస్తే …ప్రజలు చంద్రబాబుకు ఎందుకు ఓట్లు వేయాలని సందేహం వ్యక్తం చేశారు.