ఈ సంవత్సరం నాలుగు గ్రహణాలు కనువిందు చేయనున్నట్లు పరిశోధకులు తెలిపారు. అందులో రెండు సూర్య గ్రహణాలు ఉంటాయని, మరో రెండు చంద్ర గ్రహణాలు ఉంటాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు. మొదటి సూర్యగ్రహణం ఏప్రిల్ 20వ తేదిన ఏర్పడనున్నట్లు తెలిపారు. ఈ గ్రహణానికి ఓ ప్రత్యేకత ఉందన్నారు. ఇటువంటి గ్రహణాన్ని ఖగోళ శాస్త్రవేత్తలు హైబ్రిడ్ సూర్యగ్రహణం(Hybrid Solar Eclipse)గా నామకరణం చేశారు.
ఒకే రోజు మూడు గ్రహణాలు కనిపంచనుండటంతో దీనిని హైబ్రిడ్ గ్రహణం(Hybrid Solar Eclipse) అని అంటారని ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు. ఇటువంటి గ్రహణాన్ని నిగలు సూర్యగ్రహణం, శంకర సూర్యగ్రహణం లేదా కంకణాకార సూర్యగ్రహణం అని కూడా అంటారని వెల్లడించారు. ఈ నెల 20వ తేదిన ఉదయం 7.04 గంటలకు ఈ గ్రహణం ప్రారంభమవుతుందని, మధ్యామ్నం 1.29 గంట వరకూ కొనసాగుతుందన్నారు.
అయితే ఈ సూర్యగ్రహణం(Hybrid Solar Eclipse) భారత్ లో మాత్రం కనిపించదని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలోని ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, పాపువా న్యూ గినియా తదితర దేశాల్లో మాత్రమే ఈ హైబ్రిడ్ సూర్య గ్రహణం కనిపించనుందని ఖగోళ శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఇటువంటి హైబ్రిడ్ సూర్య గ్రహనం చివరిసారి 2013లో కనిపించిందన్నారు.