ఆంధ్రప్రదేశ్ (AP)లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై (YSRCP) తిరుగుబాటు మొదలైంది. అటు క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి తిరుగుబాటు (Revolt) వస్తుండగా.. ఇటు సొంత పార్టీ నాయకులే పార్టీపై అక్కసు వెళ్లగక్కుతున్నారు. అది ఎమ్మెల్యే (MLA) మొదలుకుని సర్పంచ్ (Sarpanch) వరకు పార్టీపై అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఈ క్రమంలోనే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో జరిగిన పరిణామాలు. వాళ్లు బయటకు వెళ్లగక్కారు.. కానీ లోలోపల అసంతృప్తితో రగులుతూ పార్టీలో కొనసాగుతున్న వారు చాలా మంది ఉన్నారు. ఇక గ్రామ స్థాయిల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. తాజాగా సర్పంచ్ లు అందరూ వైసీపీకి బై బై చెప్పేస్తున్నారు. ఒక సర్పంచ్ అయితే ‘మీకు ఓటేసి తప్పు చేశాం’ అంటూ ఏకంగా చెప్పుతో (Chappal) తనను తాను కొట్టుకున్న సంఘటన జరిగింది.
ఉమ్మడి కృష్ణా జిల్లా సర్పంచ్ లంతా సోమవారం విజయవాడలో (Vijayawada) సమావేశమయ్యారు. ప్రభుత్వం పంచాయతీలపై వివక్ష, పార్టీలో తమకు ప్రాధాన్యం లేకపోవడంపై ఈ సమావేశంలో సర్పంచ్ లు చర్చించారు. అప్పులు (Debts) చేసి గ్రామాల్లో అభివృద్ధి పనులు చేస్తుంటే వాటికి సంబంధించిన బకాయిలు సీఎం జగన్ విడుదల చేయడం లేదని సర్పంచ్ లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమయంలో ‘నువ్వే మా భవిష్యత్’ అంటూ స్టిక్కర్లు (Stickers) అంటించడానికి ఎలా వెళ్తామని నిలదీశారు.
ఈ క్రమంలో ప్రకాశం జిల్లా (Prakasam District) చినగానిపల్లె సర్పంచ్, సర్పంచ్ ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పగడాల రమేశ్ (Pagadala Ramesh) తన చెప్పుతో కొట్టేసుకున్నాడు. ‘మీ పార్టీ తరఫున గెలిచామని చెప్పేందుకు సిగ్గుపడుతున్నాం. మీకు ఓటు వేసినందుకు మా చెప్పుతో మేం కొట్టుకుంటున్నాం. వైఎస్సార్ అంటే అభిమానం. ఆయన బిడ్డగా జగన్ ను నమ్మాం. కానీ మీరు మమ్మల్ని నట్టేటా ముంచారు. ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏపీలో తయారైంది. ఒకవేళ సర్పంచ్ లు ఆత్మహత్యలు చేసుకుంటే దానికి సీఎం జగనే కారణం’ అంటూ రమేశ్ తెలిపాడు. గత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం పంచాయతీలకు ఇచ్చిన నిధులు రూ.2,020 కోట్లు ఏమయ్యాయని సర్పంచ్ ల సంఘం వ్యవస్థాపకుడు వైవీబీ రాజేంద్రప్రసాద్ నిలదీశారు. సచివాలయాల కార్యదర్శులు, వాలంటీర్లతో సమాంతర వ్యవస్థను ఏర్పాటుచేసి పంచాయతీలను భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. సర్పంచ్ లు సమస్యలు చెబితే ఉల్టా కేసులు పెడుతున్నారని మరో సర్పంచ్ కొండబాబు ఆవేదన వ్యక్తం చేశారు. సర్పంచ్ గా గెలిచి రెండేళ్లయినా ఒక్క బిల్లు రాలేదని వాపోయారు.