Governor Tamilisai : పెండింగ్ బిల్లులపై తెలంగాణ గవర్నర్ తమిళిసై కీలక నిర్ణయం తీసుకున్నారు. తన వద్ద పెండింగ్ లో ఉన్న 10 బిల్లుల్లో మూడు బిల్లులకు ఆమోద ముద్ర వేశారు. అలాగే మరో రెండు బిల్లులను ఆమోదం కోసం రాష్ట్రపతికి పంపించారు. ఇక మరో రెండు బిల్లులను తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్ పంపించారు. కాగా గవర్నర్ పెండింగ్ బిల్లులను ఆమోదించడం లేదని ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే ఈ పిటీషన్ పై నేడు సుప్రీంలో విచారణ జరగనున్న నేపథ్యంలో గవర్నర్ 3 బిల్లులకు ఆమోదం తెల్పడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ ఎలా జరగబోతుందనేది ఆసక్తికరంగా మారింది.
కొన్ని నెలలుగా పెండింగ్ బిల్లుల అంశంపై కేసీఆర్ సర్కారుకు, గవర్నర్ కు మధ్య వివాదం నడుస్తోంది. గవర్నర్ ఎంతకీ పెండింగ్ బిల్లులను ఆమోదించడం లేదంటూ.. గవర్నర్ తమిళిసై అనుసరిస్తున్న వ్యవహారంపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది రాష్ట్ర ప్రభుత్వం. గతేడాది శాసనసభ ఆమోదించిందిన 10 బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలపకపోవడంపై న్యాయపోరాటానికి సిద్ధమైంది. ఈ మేరకు సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి రిట్ పిటిషన్ వేశారు. ఈ రిట్ పిటీషన్లో ప్రతివాదిగా గవర్నర్ పేరును చేర్చారు. ఉభయసభల్లో ఆమోదం అనంతరం మరుసటి రోజున నిబంధనల మేరకు రాజ్‌భవన్‌కు పంపించారు. గవర్నర్ వాటిని పరిశీలించి ఆమోదించాక.. గెజిట్ నోటిఫికేషన్లో ప్రచురించాల్సి ఉంటుంది. అప్పుడు అవి చట్టరూపం పొంది అమల్లోకి వస్తాయి.