ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ ఫ్రాంఛైజీ కెప్టెన్‌ని మార్చబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. గత ఏడాది వరకూ పంజాబ్ కింగ్స్ టీమ్‌ని కెప్టెన్‌గా నడిపించిన కేఎల్ రాహుల్ .. ఐపీఎల్ 2022కి ముందు ఆ జట్టుని వీడి లక్నో సూపర్ జెయింట్స్‌కి వెళ్లిపోయాడు. దాంతో.. అతని స్థానంలో మయాంక్ అగర్వాల్ ఐపీఎల్ 2022 సీజన్లో కెప్టెన్‌గా పంజాబ్ కింగ్స్ జట్టుని నడిపించాడు.
కానీ.. ఐపీఎల్ 2022 సీజన్ లీగ్ దశలో 14 మ్యాచ్‌లాడిన పంజాబ్ కింగ్స్ టీమ్ కేవలం ఏడు మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించి కనీసం ప్లేఆఫ్స్‌కి కూడా అర్హత సాధించలేకపోయింది. కెప్టెన్‌గానే కాదు బ్యాటర్‌గా కూడా మయాంక్ అగర్వాల్ విఫలమయ్యాడు. సీజన్లో 13 మ్యాచ్‌లాడిన మయాంక్ అగర్వాల్ 16.33 సగటుతో కేవలం 196 పరుగులే చేశాడు. ఇందులో ఒకే ఒక హాఫ్ సెంచరీ ఉండటం గమనార్హం. దాంతో ఐపీఎల్ 2023 (IPL 2023)కి అతడ్ని కెప్టెన్సీ నుంచి తప్పించాలని పంజాబ్ కింగ్స్ ఫ్రాంఛైజీ భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి.
మయాంక్ అగర్వాల్‌ని కెప్టెన్సీ నుంచి తప్పించబోతున్నట్లు వస్తున్న వార్తల్ని పంజాబ్ కింగ్స్ ఫ్రాంఛైజీ ఖండించింది. ‘‘కెప్టెన్సీ మార్పుపై స్పోర్ట్స్ వెబ్సైట్లలో చక్కర్లు కొడుతున్న వార్తల్లో నిజం లేదు. ఇప్పటి వరకూ అధికారికంగా పంజాబ్ కింగ్స్ ఫ్రాంఛైజీ కెప్టెన్సీ మార్పుపై ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు’’ అని ఓ ప్రకటనని విడుదల చేసింది. 2008 నుంచి ఐపీఎల్ జరుగుతుండగా.. ఇప్పటి వరకూ పంజాబ్ కింగ్స్ ఒక్కసారి కూడా టైటిల్ విజేతగా నిలవలేకపోయింది.