»Cm Mamata Banerjee Lashes Out At Govt Staff Demanding Further Hike In Da
Mamata Banerjee మీకు చాలకుంటే నా తల తీసేయండి : సీఎం మమతా బెనర్జీ
వేతనంతో కూడిన ఇన్నేసి సెలవులను ఏ ప్రభుత్వం ఇస్తోంది? డీఏ కోసం రూ.1.79 లక్షల కోట్లు ఖర్చు చేశాం. 40 రోజులు వేతనంతో కూడిన సెలవులు ఇస్తున్నాం. మీరు ఎందుకు కేంద్ర ప్రభుత్వంతో పోలుస్తున్నారు. మేం ఉచితంగా బియ్యం ఇస్తున్నాం. కానీ గ్యాస్ ధర చూడండి ఎంత ఉందో? ఎన్నికల తర్వాత రోజే ధరలు పెరుగుతాయి
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల (Govt Employees) ఆందోళనపై పశ్చిమ బెంగాల్ (West Bengal) ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (All India Trinamool Congress Party) అధినేత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు తీరుపై మండిపడ్డారు. మీరు ఏమైనా చేస్కోండి.. నేను మాత్రం పెంచేదే లేదు అని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ప్రస్తుతం ఉన్న డీఏను పెంచేందుకు నిధులు లేవని తెలిపారు. అసెంబ్లీ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగులకు ఇంకా కావాలంటే నా తల నరికి తీసుకెళ్లండి అంటూ సంచలన ప్రకటన చేశారు.
పశ్చిమ బెంగాల్ బడ్జెట్ ను ఫిబ్రవరి 15న మమతా బెనర్జీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్ లో పింఛన్ దారులతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు మార్చి నుంచి 3 శాతం డీఏ (డియర్ నెస్ అలవెన్స్ Dearness Allowance- DA) అదనంగా చెల్లిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగా ఉద్యోగుల డీఏ (DA) కింద రూ.1.79 లక్షల కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. అయినా కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ (Congress Party), బీజేపీ, వామపక్షాల (Communist Parties)తో కలిసి ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి సమానంగా రాష్ట్రంలో డీఏ పెంచాలని ఉద్యోగులు చేస్తున్న ఉద్యమానికి ప్రతిపక్ష పార్టీలు మద్దతు తెలిపాయి. దీంతో బెంగాల్ లో పెద్ద ఎత్తున ఉద్యమం సాగుతోంది. దీనిపై మంగళవారం అసెంబ్లీలో చర్చకు రాగా మమతా ఆక్రోశం వ్యక్తం చేశారు.
‘ఉద్యోగులు తరచూ డీఏ పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్నదానికంటే పెంచడం కుదరదు. ప్రభుత్వం దగ్గర నిధులు లేవు. ఇప్పటికే అదనంగా మూడు శాతం డీఏ ప్రకటించాం. మీకు ఇంకా ఎంత కావాలి? ఆ పెంపుతో మీరు సంతోషంగా లేకపోతే నా తల తీసేయండి’ అంటూ మమతా బెనర్జీ అసహనం వ్యక్తం చేశారు. ‘కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పే స్కేల్ రెండు వేర్వేరు. వేతనంతో కూడిన ఇన్నేసి సెలవులను ఏ ప్రభుత్వం ఇస్తోంది? డీఏ కోసం రూ.1.79 లక్షల కోట్లు ఖర్చు చేశాం. 40 రోజులు వేతనంతో కూడిన సెలవులు ఇస్తున్నాం. మీరు ఎందుకు కేంద్ర ప్రభుత్వంతో పోలుస్తున్నారు. మేం ఉచితంగా బియ్యం ఇస్తున్నాం. కానీ గ్యాస్ ధర చూడండి ఎంత ఉందో? ఎన్నికల తర్వాత రోజే ధరలు పెరుగుతాయి’ అంటూ కేంద్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ఇటీవల గ్యాస్ ధరలు పెంపును ప్రస్తావించారు. కాగా ఢిల్లీ లిక్కర్ కుంభకోణంపై మమతా బెనర్జీ కూడా స్పందించారు. ప్రతిపక్ష పార్టీలతో కలిసి ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. ఉద్దేశపూర్వకంగా నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులపై కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నట్లు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో కలిసి మమతా ప్రధానికి లేఖ రాసిన విషయం తెలిసిందే.