దేశ టెలికాం రంగంలో నవ శకం మొదలైంది. దేశంలో 5జీ సేవలను ఈ రోజు ఉదయం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. దేశ రాజధాని ఢిల్లీలోని ప్రగతి మైదాన్ లో 6వ ఇండియా మొబైల్ కాంగ్రెస్-2022 కార్యక్రమాన్ని ప్రారంభిచిన మోదీ… 5జీ ఇంటర్నెట్ సేవలను కూడా ప్రారంభించారు. దేశంలోని 13 నగరాల్లో ముందుగా ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి.
ప్రస్తుతానికి కొన్ని ప్రధాన నగరాల్లోనే 5జీ సేవలు అందిస్తున్నారు. తొలిదశలో ముంబై, ఢిల్లీ, బెంగళూరు, కోల్ కతా, హైదరాబాద్, పునె, అహ్మదాబాద్, చండీగడ్, గాంధీనగర్, గురుగ్రాం, లక్నోలో మాత్రమే 5 జీ సేవలు అందుబాటులోకి వస్తాయి. రెండేళ్లలో దేశమంతటా 5 జీ సేవలు విస్తరించనున్నారు.
ఇదిలా ఉండగా… కొద్ది నెలల కిందట 5జీ స్పెక్ట్రం వేలం జరిగిన సంగతి తెలిసిందే. 5జీ స్పెక్ట్రం కేటాయింపుల కోసం టెలికాం ఆపరేటర్ల నుంచి రూ 1.5 లక్షల కోట్ల విలువైన బిడ్స్ వచ్చాయి. ఇందులో రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా, అదానీ డేటా నెట్వర్క్స్ పాల్గొన్నాయి. మొత్తం 72,098 మెగా హెట్జ్ స్పెక్ట్రమ్ వేలం వేయగా.. 51,236 మెగా హెట్జ్ (71 శాతం) విక్రయించబడిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. రాబోయే రెండు మూడేండ్లలో దేశంలోని అన్ని ప్రాంతాలకు 5జీ చేరువవుతుందని అన్నారు. 5జీ అందుబాటు ధరలో ఉండేలా చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు.