తెలంగాణలో రైతుల పంట రుణాలు ఈ ఏడాది రూ.90 వేల లోపు ఉన్న వారికి మాత్రమే మాఫీ చేయనున్నట్లు ఆర్థిక మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. అందుకోసం బడ్జెట్లో రూ.6,385 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. దీంతో రూ.37 వేల నుంచి రూ.90 వేల వరకు ఉన్న వ్యవసాయ రుణాలు మాఫీ కానున్నాయి. అయితే గత బడ్జెట్లో రూ.4000 కోట్లు ప్రకటించిన ప్రభుత్వం ఈసారి మరో రూ.2,385 కోట్లు అదనంగా పెంచింది.
రాష్ట్రంలో 2014 ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు మొదట లక్ష రూపాయల మేరకు రైతు రుణాలను మాఫీ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో 35.31 లక్షల మంది రైతులు లబ్ధిపొందారని తెలిపింది. ఆ తర్వాత 2018 నుంచి ఇప్పటివరకు రూ.1,207 కోట్ల వరకు రైతు రుణాలను మాఫీ చేయగా 5.42 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరిందని వెల్లడించింది.