అపార్టుమెంట్లలో ఫ్లాట్లు కొని చాలా మంది బిల్డర్ల నుంచి కొన్ని సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. ఈ రోజుల్లో ప్రధాన నగరాల్లో అపార్టుమెంట్లలో బతికేవారే ఎక్కువగా ఉన్నారు. తమ సొంతింటిని సాకారం చేసుకునేందుకు వివిధ రంగాల్లో పనిచేసేవారు సేవింగ్స్ చేసి ఫ్లాట్లను కొనుగోలు చేస్తుంటారు. తమ పిల్లలకు పేరెంట్స్ ఈ ఫ్లాట్లను బహుమతిగా కూడా ఇస్తుంటారు. అయితే ఫ్లాట్లు కొనుగోలు చేసిన తర్వాత వారికి పలు రకాల ఇబ్బందులు అనేవి ఎదురవుతుంటాయి. ముఖ్యంగా బిల్డర్ల నుంచి వారికి కొన్ని సమస్యలు వాటిల్లుతుంటాయి. అందులో ముఖ్యంగా చెప్పాలంటే కామన్ ఏరియాపై హక్కు గురించి కొన్ని ఇబ్బందులు తలెత్తకుండా ఉండవు.
తాజాగా ఈ విషయంలోనే మద్రాసు హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. దీంతో ఫ్లాట్ల యజమానుల హక్కులను హరించే బిల్డర్లకు గట్టి షాక్ తగిలింది. అపార్టుమెంట్లలో ఉమ్మడి స్థలం అంటే కామన్ ఏరియా అనేది ఫ్లాట్ల యజమానులకే చెందుతుందని, అందులో బిల్డర్లకు ఎటువంటి హక్కు ఉండదని తీర్పునిచ్చింది. మద్రాసు హైకోర్టు న్యాయమూర్తులు అయిన జస్టిస్ ఆర్.సుబ్రమణియన్, జస్టిస్ కె.కుమరేష్ బాబుతో కూడిన ధర్మాసం ఈ సంచలన తీర్పునిచ్చింది.
చెన్నైలోని ఆళ్వార్ పేటలోని ఓ స్థలంలో 2001లో రమణీయం రియల్ ఎస్టేట్ సంస్థ ఓ బిల్డింగ్ ను నిర్మించి తానే యజమానిగా చెబుతూ ఓ వ్యక్తికి ఫ్లాట్ ను అమ్మింది. దానిపై అబోట్స్ బరీ ఓనర్ల అసోసియేషన్ తీవ్రంగా స్పందించింది. యజమానుల హక్కులను హరించేవిధంగా ఉండటాన్ని వ్యతిరేకించింది. అయితే కోర్టులో నిర్మాణ ప్రదేశం నాన్ ఎఫ్ఎస్ఐ కిందకు రాదని బిల్డర్ తరపు న్యాయవాది వాదించారు. తమ నిర్మాణ ప్రాంతం 1.30 లక్షల చదరపు అడుగులకు బదులుగా 2 లక్షల చదరపు అడుగులు పడిందని, ఇది పొరపాటుగా జరిగిందని తెలిపింది.
న్యాయస్థానం బిల్డర్ వ్యవహార శైలిని తప్పుపట్టింది. భూమికి, భవణానికి ఏ ప్రమోటరూ విడివిడిగా ఛార్జీలు వసూలు చేయలేరని తెలిపింది. ఈ కేసులో బిల్డర్ ఉద్దేశపూర్వకంగానే తప్పు చేసినట్లు కోర్టు తేల్చింది. కామన్ ఏరియా అనేది ఆ భూమి ఫ్లాట్ల యజమానులకే చెందుతుందని మద్రాసు హైకోర్టు తీర్పునిచ్చింది. అంతేకాకుండా నాన్ ఎఫ్ఎస్ఐ ఖాళీ భవణాన్ని కూడా వెంటనే ఫ్లాట్ల యజమానుల సంఘానికి అప్పగించాలని చెన్నై మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీని ఆదేశించింది.