ఏపీలో రాజకీయాలు ఒక్కసారి హీటెక్కాయి. అందుకు అసెంబ్లీలో సీఎం జగన్ తీసుకున్న నిర్ణయమే కారణం. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరును మారుస్తూ జగన్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ నేతలు ఆందోళన చేస్తూనే ఉన్నారు. కాగా.. తాజాగా పవన్ కూడా ఈ విషయంపై స్పందించారు. ఎన్టీఆర్ పేరు మార్చి వైఎస్ ఆర్ పేరు పెట్టడం వల్ల అన్నీ మారిపోతాయా..? అక్కడ వసతుల్లో మార్పులు వస్తాయా అని పవన్ ప్రశ్నించారు. కొత్త వివాదాలను సృష్టించడానికే జగన్ ఇలాంటి పనులు చేస్తున్నారని పవన్ మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్లో వైద్య సదుపాయాలు ప్రమాణాలకు తగిన విధంగా లేవని, ఏ ప్రభుత్వ ఆసుపత్రిలోనూ తగినన్ని బెడ్స్ లేదని పవన్ కల్యాణ్ దుయ్యబట్టారు. సిబ్బంది, మందులు అందుబాటులో వుండవని.. కోవిడ్ సమయంలో మాస్కులు అడిగిన డాక్టర్ సుధాకర్ని వేధించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
కొత్త వివాదాలు సృష్టించేందుకో.. ప్రజల దృష్టిని మరల్చేందుకో చేసిన ప్రయత్నంలా వర్సిటీ పేరు మార్పు వ్యవహారం వుందని పవన్ ఆరోపించారు. అంతగా పేర్లు మార్చాలి అనుకుంటే విశాఖలోని కింగ్ జార్జ్ ఆసుపత్రి.. ఇంకా బ్రిటీష్ వాసనలతోనే వుందని దాని పేరు మార్చొచ్చు కదా అంటూ పవన్ ఎద్దేవా చేశారు. ప్రఖ్యాత శాస్త్రవేత్త యల్లాప్రగడ సుబ్బారావు పేరు ఈ పాలకులకు తెలుసా అని పవన్ ప్రశ్నించారు. బోదకాలు, టైఫాయిడ్ వంటి వ్యాధులకు ఆయన మందులను కనుగొన్నారని జనసేనాని గుర్తుచేశారు. తెలుగు వారైన యెల్లాప్రగడ పేరుని కనీసం ఒక్క సంస్థకైనా ఈ పాలకులు పెట్టారా అని పవన్ ప్రశ్నించారు . ఇంట్లో వాళ్ల పేర్లు ప్రజల ఆస్తులకు పెట్టడం కాదని.. జనక్షేమం కోసం జీవితాలను త్యాగం చేసిన మహనీయుల గురించి పాలకులు తెలుసుకోవాలంటూ సీఎం జగన్కు ఆయన చురకలు వేశారు.