కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి హాట్ కామెంట్స్ చేశారు. ఎన్నికలు సమీపిస్తోన్న వేళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో గొడవలు బాధాకరం అన్నారు. నేతల మధ్య సయోధ్య కుదర్చడానికి ఇంఛార్జీ రావడం ఇబ్బందిగా ఫీలవుతున్నానని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికకు పట్టుమని ఏడాది కూడా లేదని చెప్పారు. నేతలు కలుపుకొని పోవాల్సిన అవసరం ఉందన్నారు. రేవంత్ రెడ్డి పాదయాత్ర చేపట్టడాన్ని స్వాగతించారు. యాత్రలో తాను కూడా పాల్గొంటానని తెలిపారు. ఖమ్మం జిల్లాకు రావాలని ఆయనను ఆహ్వానిస్తానని తెలిపారు. పార్టీ నుంచి వెళ్లిపోయిన ఎమ్మెల్యేలు ఓట్ల కోసం గ్రామాల్లోకి ఎలా వస్తారో చూస్తానని తనదైన శైలిలో వార్నింగ్ ఇచ్చారు.
తాను ఖమ్మం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తానని రేణుకా చౌదరి వెల్లడించారు. అసెంబ్లీ బరిలో ఉంటానని స్పష్టంచేశారు. పొరుగు రాష్ట్రంలో పోటీ చేయాలని ఉందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో గల గుడివాడ నుంచి పోటీచేయాలనే ఆహ్వానం తనకు వచ్చిందన్నారు. అవసరమైతే రెండు చోట్లా పోటీ చేస్తానని చెప్పారు. గుడివాడ నుంచి ప్రస్తుతం కోడాలి నాని ప్రాతినిధ్యం వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సీటు టీడీపీకి కంచుకోట.. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి నాని గెలిచారు. ఆ తర్వాత మంత్రి పదవీ కూడా చేపట్టారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో పదవీ పోయింది.
కాంగ్రెస్ పార్టీ సముద్రం అని.. అందరినీ ఆహ్వానిస్తామని రేణుకా చౌదరి కామెంట్స్ అన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీలో చేరే అంశం తన పరిధిలో లేదన్నారు. ఆ వ్యవహారాలను కాంగ్రెస్ ఇంచార్జీ మాణిక్ రావ్ ఠాక్రే చూసుకుంటారని వెల్లడించారు.