ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా తెలంగాణ బడ్జెట్ ఉంటుందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా బడ్జెట్ రూపొందించినట్లు తెలిపారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా సోమవారం అసెంబ్లీలో మంత్రి హరీశ్ రావు బడ్జెట్ ప్రసంగం చేశారు. అంతకుముందు జూబ్లీహిల్స్ లోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి బడ్జెట్ ప్రతులతో మంత్రి హరీశ్ రావు విచ్చేసి పూజలు చేశారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు సీఎం కేసీఆర్ కు పాదాభివందనం చేశారు. అటు నుంచి శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఇక మండలిలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బడ్జెట్ ప్రసంగం చేశారు.
‘కేంద్రం నుండి వివక్ష కొనసాగుతుంటే, ఒక్క రూపాయి కూడా కేంద్రం నుండి రాకపోయినా అభివృద్ధి ధ్యేయంగా తెలంగాణ ముందుకెళ్తోంది. సంక్షేమ పథకాలు ఆగకూడదన్న కేసీఆర్ ఆలోచనతో బడ్జెట్ కేటాయింపులు చేశాం. తెలంగాణ మోడల్ దేశం అవలంభిస్తోంది. దేశానికి రోల్ మోడల్ తెలంగాణ నిలిచింది. సభలో నేను, మండలి లో ప్రశాంత్ రెడ్డి ప్రవేశ పెడుతారు’ అని మంత్రి హరీశ్ రావు తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు.